హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: ప్రధాని మోదీ పర్యటనపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. రామగుండం నుంచి హైదరాబాద్ వయా కరీంనగర్ మీదుగా మోదీ రాకను నిరసిస్తూ ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ఇప్పటికే పలు ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు మోదీ రాకపై తమ ధర్మాగ్రహాన్ని ప్రకటించాయి. విభజన హామీలను నెరవేర్చరేం? అంటూ బుద్ధిజీవులు నిలదీస్తున్నారు. మోదీపై సింగరేణి పిడికిలి ఎత్తింది. చేనేత చేతులు విరిచిన మోదీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కులేదని నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టమైన ప్రకటన చేశాకే తెలంగాణలో అడుగుపెట్టాలని సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘాలు డిమాం డ్ చేశాయి. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ గురువారం సింగరేణి ప్రాంతంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. రామగుండం రీజియన్‌తోపాటు కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియా ల్లో టీబీజీకేఎస్‌తోపాటు వివిధ కార్మిక సంఘా ల నాయకులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రధాని మోదీకి రాష్ట్ర పౌరహక్కుల సంఘం పలు అంశాలతో కూడిన బహిరంగ లేఖ విడుదల చేసింది. ఎఫ్‌సీఐ మూసివేత సమయంలోని 1400 మంది కాంట్రాక్టు కార్మికులకు తిరిగి అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి ధ్వజమెత్తారు.
విభజన హామీలు నెరవేర్చండి
‘మోదీ..తెలంగాణకు ఎందుకొస్తున్నారు? మీ రాకతో ఇక్కడి ప్రజలకు ఏమైనా ప్రయోజనమున్నదా? ఉత్త చేతులతో రాకండి.. రామగుండానికి ఏదైనా ప్రాజెక్టు తీసుకురండి’ అని ఎన్నారై, వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీశ్‌రెడ్డి అమెరికా నుంచి విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఉత్పత్తి మొదలయ్యాక.. ప్రారంభించడమేంది ?
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో 2021లో ఉత్పత్తి ప్రారంభమైందని, ఇప్పటికే 10 లక్షల టన్నుల సరఫరా జరిగి, రూ.87 కోట్ల లాభం వచ్చిందని, ఇప్పుడు మోదీ వచ్చి ప్రారంభించడం ఏంటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే పాత ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభం చేస్తున్నారని భువనగిరిలో జరిగిన సమావేశంలో విమర్శించారు.
నిరసన సెగ తప్పదు
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందాన్ని 17నెలలు గడిచినా అమలుచేయని ప్రధాని మోదీకి ఈ ప్రాంతానికి వచ్చే నైతికత లేదు. వేతన ఒప్పందాల్లో డీపీఈ నిబంధనలు విధించి వేతనాల పెంపుదల 3% నుంచి 10%కి పరిమితం చేయాలని చూస్తున్నారు. వేతన ఒప్పందాలు బొగ్గు పరిశ్రమల యాజమాన్యాల పేయింగ్ కెపాసిటీ, కార్మిక సంఘాల డిమాండ్ ఆధారంగా పరిష్కరించాలి. కానీ, కేంద్రం జోక్యం చేసుకొని ఇంత శాతమే ఇస్తామని చెప్పడం సరైంది కాదు. మోదీ పర్యటనను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 10 నుంచి 12 వరకు నిరసనలు తెలుపుతాం.
– వాసిరెడ్డి సీతారామయ్య,ఏఐటీయూసీ కేంద్ర ప్రధాన కార్యదర్శి
కేంద్ర వాటాను తెలంగాణకు ఇవ్వాలి
సింగరేణిలో కేంద్రానికి ఉన్న 49% వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి మోదీ ఇవ్వాలి. సింగరేణిలో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు తెచ్చారు. ఈ ప్రాంతంపై ఆయనకు ఒక విజన్ ఉన్నది. ఎలాంటి అవగాహన లేని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఇప్పటికైనా ఆలోచన చేసి తమ వాటాను రాష్ర్టానికి అప్పగించాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్న మోదీ.. ఈ ప్రాంతంలో తన పట్ల ఉన్న వ్యతిరేకతను తెలుసుకోవాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి
లక్షల కోట్ల వాటాలు కొల్లగొట్టేందుకే ప్రయత్నం
2025 నాటికి రూ.6 లక్షల కోట్ల విలువైన పీఎస్‌యూ వాటాలను అమ్మేందుకు కేంద్రం నిర్ణయించింది. బొగ్గు పరిశ్రమలకు సంబంధించిన వాటాను సైతం అమ్మే కుట్రకు మోదీ ప్రయత్నిస్తున్నారు. దీనిని అడ్డుకోవాలి. ఈ నెల 12న రామగుండానికి వస్తున్న మోదీకి నిరసన తెలియజేస్తాం. ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేయడం అనుమానాలకు తావిస్తున్నది. ఇక్కడి పీఎస్‌యూలను అమ్మేందుకే మోదీ వస్తున్నారు.
– జనక్‌ప్రసాద్, ఐఎన్టీయూసీ కేంద్ర ప్రధాన కార్యదర్శి