హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోతే టీజీ జెన్కోకు బొగ్గు సరఫరా నిలిపివేయిస్తామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) సర్కార్ను హెచ్చరించింది. జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు సరఫరాను సైతం నిలిపివేస్తామని ప్రకటించింది. సింగరేణికి రావాల్సిన రూ.46వేల కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఖైరతాబాద్ విద్యుత్తు సౌధ ఎదుట ధర్నా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులు నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. లాభాలు వచ్చినప్పుడు బొనాంజా అని ప్రకటించిన ప్రజాప్రతినిధులు, ఆర్థికలేమి నుంచి సింగరేణిని గట్టెక్కించాలని లేదంటే బీఐఎఫ్ఆర్లోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. సంస్థ అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోకపోవడం, అసెంబ్లీలో బకాయిలపై మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు. ధర్నాలో భూపాల్, మంద నర్సింహారావు, తుమ్మల రాజారెడ్డి, అల్లి రాజేందర్, మండె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.