గోదావరిఖని, డిసెంబర్ 25 : సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ఖాళీగా ఉన్నది. ఈ నెల 16 వరకు సంస్థ చైర్మన్‌గా కొనసాగిన బలరామ్కే ఇన్చార్జి బాధ్యతలు ఉండగా, ప్రస్తుతం పది రోజులుగా ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేల కోట్ల వ్యాపారం చేసే సంస్థ.. పెన్సిల్ నుంచి ఏది కొనాలన్నా డైరెక్టర్ ఫైనాన్స్ అనుమతి కావాలి.
కీలకమైన ఈ పోస్టు ఖాళీగా ఉంటున్నది. మొన్నటి వరకు చైర్మన్‌గా పనిచేసిన బలరాం ఈ పోస్టును భర్తీ చేయకుండా తన వద్ద పెట్టుకోవడంతో పని నడిచింది. ఇటీవల ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్‌కు కేవలం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గానే బాధ్యతలు కల్పించారు. గత చైర్మన్ వద్దనున్న డైరెక్టర్ ఫైనాన్స్ బాధ్యతలను చైర్మన్‌కు గానీ, ఇతర డైరెక్టర్లకు గానీ అదనపు బాధ్యతలు అప్పగించకపోవడంతో ఫైల్స్ పేరుకుపోతున్నట్టు తెలుస్తున్నది.
గోదావరిఖని, డిసెంబర్ 25: మణుగూరు సీకే ఓసీ-2 ఎక్స్‌టెన్షన్‌ను సింగరేణి సంస్థకే కేటాయించాలని, ప్రైవేటు వ్యక్తుల వేలానికి వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న ‘చలో మణుగూరు’ నిర్వహిస్తున్నట్టు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రెస్‌క్లబ్‌లో నాయకులు రియాజ్ అహ్మద్, కృష్ణ మీడియాతో మాట్లాడారు.
సింగరేణి పరిరక్షణ కోసం ఐక్యవేదిక పనిచేస్తున్నట్టు తెలిపారు. మొదటి నుంచి అన్ని సంఘాలు సింగరేణి బొగ్గు బ్లాక్‌లను టెండర్ వేయకుండా సింగరేణికి కేటాయించాలనే డిమాండ్‌తో ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నట్టు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జెన్కో ద్వారా టెండర్ వేయించి బ్లాక్‌ను దక్కించుకునే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.