Singareni | పెద్దపల్లి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి తీరు అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ కొంగుబంగారంగా వెలుగులీనిన సంస్థలో పాలన గాడి తప్పుతున్నది. ‘కార్మికులకు ఇది చేస్తాం.. అది చేస్తాం అని’ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రభుత్వాలు, సంఘాలు పాతరవేస్తుండగా, యా జమాన్యం రోజుకో ఆదేశం.. కొత్త ని బంధన తెస్తుండగా, కార్మికులు ఆగమవుతున్నారు. చోద్యం చూస్తున్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల తీరుపై మండిపడుతున్నారు.
సింగరేణి సంస్థ నిర్ణయాలు కార్మికులను ఆగమాగం చేస్తున్నాయి. మార్పు మన మంచికే అని ఓట్లేసిన సింగరేణి కార్మికుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్, ఇటు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఐఎన్టీయూసీ వదిలేయడంపై తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘంగా, ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్త సర్కారు కొలువు దీరిన నాటి నుంచి సింగరేణిలో అనేక రకాల కొత్త నిబంధనలు పుట్టుకురావడం, కొర్రీలు పెడుతుండటంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్లో కార్డ్, రెడ్ కార్డు విధానాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అమలు చేసింది. కార్మికులు రక్షణకు సంబంధించి తెలిసీతెలియక చేసే పొరపాట్లకు, ఏ చిన్న తప్పులకైనా ఈ కార్డులను వినియోగిస్తూ సింగరేణి కార్మికుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా పంపుతున్నది. దీనిపై కార్మికులు, కార్మిక సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకించగా, యాజమాన్యం వెనక్కితగ్గింది.
ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి సింగరేణిలోని కొంత మంది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలతో సంస్థ నష్టాలపాలవుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కొలువుదీరిన తర్వాత సివిల్స్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ ప్రవేశపెట్టారు. వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ కలిగిన కుటుంబాల్లోని అభ్యర్థి ప్రిలిమినరీ పాసై, మెయిన్స్‌కు ప్రిపేరవుతుంటే రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు సింగరేణి రూ.4 కోట్లు కేటాయించింది. ఈ స్కీంలో సింగరేణి పేరు లేకపోవడం కార్మిక కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇ టీవల అమెరికా, జపాన్ దేశాల్లో మైన్స్ ఎక్స్పో కార్యక్రమం జరగ్గా, ఆ కార్యక్రమానికి సింగరేణి సీఎండీతోపాటు అతితక్కువ మంది సింగరేణి అధికారులు వెళ్లారు.
మంత్రి భట్టితోనూ ప్రభుత్వ అధికారులు చాలామంది వెళ్లారు. ఆ ఖర్చు దాదాపు రూ.3 కోట్ల వరకు సింగరేణి నుంచే ఖర్చు చేశారనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో అన్ని పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన 176 మంది జూనియర్ అసిస్టెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విధుల్లో చేరిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగాలను తమ ఖాతాల్లో వేసుకోవాలనే ఉద్దేశంతో రెండురోజులు విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ల సర్వీసును నిలుపుదల చేయించి, రెండు నెలల తర్వాత ఎల్బీ స్టేడియంలో భారీ సభను ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాలను ఇవ్వడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వారు రెండు నెలల జీతాలను నష్టపోవడంతోపాటు రెండు నెలల సర్వీస్ వృథాఅయ్యింది.
సంస్థలో రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తున్న నిబంధనలు కార్మికులను ఇబ్బంది పెడుతున్నాయి. కార్మికులు వరుసగా మూడు రోజులు విధులకు హాజరు కాకపోతే మళ్లీ విధుల్లో చేరేందుకు ఏరియా జీఎం నుంచి అలో స్లిప్ తీసుకోవాలనే కొత్త నిబంధన తెరమీదికి వచ్చింది. ఈ నిబంధన వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో సింగరేణిలో 15 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రతి ఒక్కరూ ఐదేండ్లపాటు అండర్ గ్రౌండ్లో పనిచేయాలనే నిబంధనను విధించారు. డిపెండెంట్ కింద ఎవరు చేరినా ఇది తప్పనిసరి అని నిర్ణయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.