ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గడువు పెట్టి మరీ 6 గ్యారెంటీలను ప్రకటించింది. అందులోనూ 13 ఉప హామీలు. వీటిలో ఎక్కడా మూసీ ప్రస్తావన లేదు.
కానీ 6 నెలలు తిరగకముందే, ఒకటీ అరా తప్ప ఏ గ్యారెంటీ అమలు కాకముందే అకస్మాత్తుగా, హఠాత్తుగా మూసీ ప్రాజెక్టు తెరమీదకు వచ్చింది. దీని ఖర్చు అక్షరాలా లక్షన్నర కోట్లు! ప్రపంచంలో ఏ నదీ సుందరీకరణ ప్రాజెక్టుకూ ఒక దేశం ఇంతటిస్థాయిలో ఖర్చు చేయలేదు.
ఆరు గ్యారెంటీల అమలుకు అడుగు ముందుకు పడలేదు.మూసీ కోసం మాత్రం ఆగమేఘాలపై కూల్చివేతలు!
ఆరు గ్యారెంటీలకు సంబంధించి చిన్న సర్వే కూడా జరగట్లేదు.. కానీ యంత్రాంగమంతా మూసీపై మూకుమ్మడి సర్వే!
ఆరు గ్యారెంటీల అమలుపై సర్కార్ సమీక్షిస్తున్న దాఖలాల్లేవు. కానీ మూసీ ప్రాజెక్టుపై ప్రతిరోజూ సమీక్షల సందడే!
వేల కోట్లు అవసరమయ్యే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల్లేవట!కానీ, లక్షన్నర కోట్లు ఖర్చయ్యే మూసీకి ప్రణాళికలు సిద్ధం!
6 గ్యారెంటీల కోసం సర్కారు తీసుకున్న డాటా ఏమైందో తెల్వదు.కానీ, ఇప్పుడు మూసీ తీరంలో కొలువై లెక్కలు తీస్తున్న యంత్రాంగం!
మూసీ సుందరీకరణ ఇప్పుడు తెలంగాణకు అంత అత్యవసరమైన ప్రాజెక్టా? మిగిలిన పనులు, పథకాలు, పరేషాన్లు అన్నీ పక్కనబెట్టి అమలు చేయకపోతే తెలంగాణ కొంప మునిగేంత అర్జెంటు కార్యక్రమమా? రాత్రిగడిస్తే ఏం కొంపమునుగుతుందోనని శుక్రవారం రాత్రే పేదల కొంపలు కూల్చి చేయాల్సినంత గొప్ప పనా ఇది?
కానీ, రేవంత్ ప్రభుత్వం అట్లాగే చేస్తున్నది. 6 గ్యారెంటీల అమలుకు మాదే గ్యారెంటీ అని చెప్పిన రాహుల్, ప్రియాంక వాటి గురించి నోరు మెదపడం లేదు. మూసీపై ఇంత రచ్చ జరుగుతున్నా.. చూసీచూడనట్టు నోరెత్తడంలేదు. ఇక్కడ మూసీ ప్రాజెక్టు గొప్పతనం గురించి నోరారా అరుస్తున్న నేతలు!.. అక్కడ నోరుమూసుకుని చూస్తున్న పెద్దలు!
ఎందుకీ తొందర? ఏమిటీ దీని వెనక మతలబు? అసలేం జరుగుతున్నది?భారత్‌కు శత్రుదేశాలుగా భావించే చైనా, పాక్‌లతో పరోక్ష లింకులు! తెలంగాణ అంటేనే సరిపడని చంద్రబాబు సన్నిహితుల నీడలు!అవినీతిపరుడిగా జైలుపాలైన సింగపూర్ మంత్రి జాడలు! ఇన్ని ప్రతికూల శక్తులతో కుమ్మక్కై మూసీపై కాంగ్రెస్ సర్కార్ ఆటలు!
Musi Riverfront | హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇదేం సంవత్సరం? 2024 కదా! కానీ ఎందుకో కాలం 25 ఏండ్లు వెనక్కి తిరిగినట్టు , మనమంతా 1999 -2001కి వెళ్లిపోయినట్టు అనిపిస్తున్నది. కారణం మూసీ కూల్చివేతల వ్యవహారం. మూసీ ప్రాజెక్టు తన మానసపుత్రిక అని రేవంత్ ఎంతగా చెప్తున్నా, ఇది వైఎస్ ఆలోచన అని కేవీపీ లాజిక్కులు లాగినా, చరిత్ర అందుకు సహకరించడం లేదు. ఎందుకంటే మూసీ తీరంలో ఉన్న పేదలను తొలగించి దాన్ని వాణిజ్య కేంద్రంగా మలచాలన్న అసలు ఆలోచన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది. ఆనాడు చంద్రబాబు ఏంచేశారో ఆయన సహచరుడులాంటి శిష్యుడు రేవంత్‌రెడ్డి ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు.
మూసీ ప్రాజెక్టుకు నాడు చంద్రబాబు నందనవనం అని పేరు పెట్టారు. ఇప్పుడు రేవంత్ దీనిని ఆధునిక భాషలో రివర్ ఫ్రంట్ అన్నారు. నాడు చంద్రబాబు మూసీ మురికి నీటి ప్రక్షాళన గురించి పట్టించుకోకుండా సుందరీకరణే ముఖ్యమని, పేదల తరలింపే ఫస్ట్ ప్రియారిటీగా తీసుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. రేవంత్ కూడా ప్రక్షాళన అని పైకి చెప్తూ.. మూసీని క్లీన్ చేయడానికి బదులు పేదలను క్లీన్ చేసే పనిలో పడ్డారు. మూసీ ఒడ్డు నుంచి తరలించే పేదల కోసమంటూ నాడు బాబు కర్మన్‌ఘాట్ సమీపంలో నందనవనం అనే భారీ గృహ సముదాయాన్ని నిర్మించారు. రేవంత్‌రెడ్డి ఆ మాత్రం కష్టం కూడా పడకుండా కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను నింపుతున్నారు.
అప్పుడుచంద్రబాబు ఇప్పుడు రేవంత్ పేదల్ని బలవంతగా తరలించడం షరా మామూలే! అప్పుడూ అవినీతి ఆరోపణలు గుప్పుమనడమే కాదు ; ఏకంగా రుజువయ్యాయి. ఇప్పుడూ మూసీ భారీ స్కామ్ ముక్కుపుటాలు అదిరేలా కంపు కొడుతున్నది. ఈ పోలికలన్నీ ఇట్లా ఉంటే తాజాగా మరో అద్భుతమైన పోలిక వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఐదేండ్ల కింద అమరావతి ప్రాజెక్టును చేపట్టి, గ్రాఫిక్‌లతో రంగుల కలలు చూపించి, సగంలో వదిలేసిపోయిన సింగపూర్‌కు చెందిన ‘మెయిన్ హార్ట్’ కంపెనీయే ఇప్పుడు మూసీ కథకు అసలు కన్సల్టెంట్. ఈ మేరకు శుక్రవారమే రహస్యంగా జీవో కూడా జారీఅయ్యింది. పార్టీలేవైతేనేం? మనుషులు ఎక్కడుంటేనేం? మనసులు కలిస్తే సరిపోదా! ‘బంధాల’వే మూసీ ప్రాజెక్టు 25 ఏండ్ల తర్వాత కూడా బాబుగారు చూపిన బాటలోనే తెరమీదకు రావడం, ఐదేండ్ల క్రితం ఆయనతో సన్నిహిత సంబంధాలు నెరపిన మెయిన్ హార్ట్ కంపెనీకే ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యత కూడా దక్కడం కాకతాళీయం కాదు కదా?