రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ)/కొత్తకోట/సూర్యాపేట టౌన్/ భువనగిరి అర్బన్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. 14 ఏం డ్లు పోరాడి తెలంగాణను సాధించి, పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌పై నోరుపారేసుకుంటే సహించబోమని పార్టీ శ్రేణులు హెచ్చరించాయి. సోమవారం సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ జిల్లా, పట్టణ అధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, గంభీరావుపేటలో న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు నేతృత్వంలో కార్యకర్తలు ధర్నా చేశారు. ‘రేవంత్‌రెడ్డీ ఖబడ్దార్.. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రోడ్డుపై దిష్టిబొమ్మలు దహనం చేశారు. సీఎం సీట్లో కూర్చున్నాననే సోయిలేకుండా రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలన చేతగాక, గ్యారెంటీలను అమలు చేసే దమ్ములేక కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు మొరుగుతున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా మాటలు మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. గంభీరావుపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్ మాట్లాడుతూ.. 420 హామీలు అమలు చేస్తామని అసత్య ప్రచారంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, హామీలపై దృష్టి సారించకుండా గత ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేయడం సరికాదని హితవుపలికారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నా ఒక్క పథకం కూడా సక్రమంగా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. సూర్యాపేట, భువనగిరి జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. సీఎం రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసభ్యకర పదాలు వాడుతున్న రేవంత్ తీరు మార్చుకోవాలని నాయకులు హితవుపలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సూర్యాపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.