తుర్కపల్లి, జూన్7: మండలంలోని మాదాపురంలో సూర్య ప్రైవేట్ ఆస్పత్రిని మంగళవారం వైద్యాధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, భ్రూణ హత్యలు ప్రేరేపించడం, అనవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేయడం, కాలం చెల్లిన ఔషధాల విక్రయం వంటి ఆరోపణలతో మంగళవారం జిల్లా వైద్యాధికారి మల్లికార్జున రావు ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఆస్పత్రి నిర్వాహకుడికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి మీడియాకు వివరాలు వెల్లడించారు.
మాదాపురంలో హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఆర్ఎంపీ వైద్యుడు నర్సింగరావు పదేండ్లుగా సూర్య ఆస్పత్రిని నడుపుతున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, ఆడపిల్ల అని గుర్తిస్తే భ్రూణ హత్యకు పాల్పడడం వంటివి చేశారన్నారు. డబ్బులకు ఆశపడి సాధారణ ప్రసవాలు కావాల్సిన గర్భిణులకు సిజేరియన్లు చేసినట్లు గుర్తించామని తెలిపారు. కాలం చెల్లిన ఔషధాలను విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. గతంలో పలుమార్లు జిల్లా ప్రోగ్రాం అధికారి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆస్పత్రిపై తనిఖీ చేయగా అర్హత కలిగిన వైద్యులు లేకుండానే ఆర్ఎంపీ వైద్యుడు నర్సింగరావు రోగులకు వైద్యం చేసినట్లు తేలిందన్నారు.
అల్లోపతి యాక్ట్ ప్రకారం రిజిస్ట్రార్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎంబీబీఎస్, ఆ పైన వైద్యులే రోగులకు వైద్యం అందించాలని వెల్లడించారు. కానీ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌లో మాత్రం అర్హత కలిగిన వైద్యులు పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు. గడిచిన రెండు నెలల్లో రాష్ట్రంలో సీజేరియన్ సెక్షన్ రేటు 62 శాతం ఉంటే, జిల్లాలో 92 శాతం ఉందని గుర్తించామన్నారు. గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ అవసరం ఉందా, అవసరం లేకుండానే ఆపరేషన్లు చేస్తున్నారా అని ఆడిట్ చేయడం జరుగుతుందని చెప్పారు. చాలా ఆస్పత్రుల్లో సరైన కారణాలు లేకుండానే సీజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
బొమ్మలరామారం మండలంలోని లక్ష్మీతండాలో ఇటీవల కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన క్రమంలో వందశాతం సిజేరియన్ ఆపరేషన్లు జరిగినట్లు తేలిందని, ఈ విషయం ప్రభుత్వానికి, ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి వెళ్లిందని తెలిపారు. అందులో భాగంగా కలెక్టర్‌తో పాటు డిప్యూటీ డీఎంహెచ్ఓ తండాలను సందర్శించి సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి, సిజేరియన్ ఆపరేషన్లపై ప్రజల అభిప్రాయాలను సేకరించామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ధనార్జనతో అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు. సూర్య ఆస్పత్రి వంటి వైద్యులు ఏజెంట్లను నియమించుకుని గర్భిణులను ఆస్పత్రికి తీసుకొచ్చి, వారిలో అనవసర భయాలు కల్పించి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు తేలిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి దాడులు కొనసాగుతాయని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ సుమన్‌కల్యాణ్, డాక్టర్ వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.