వరాల వరద కేసీఆర్.. కరువు దరువు కాంగ్రెస్
కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం.. ప్రకృతి తెచ్చిన కరువు కాదిది, కాంగ్రెస్ సృష్టించిన కరువు.. ఆరు గంటలు కూడా రాని కరెంటుతో రైతులకు కష్టాలు
- నదుల్లో నీళ్లున్నా ఎత్తిపోయలేని అసమర్థ ప్రభుత్వమిది
- కొత్తవి వద్దు, ఉన్నవి రద్దు.. ఇదే కాంగ్రెస్ పాలన తీరు
- జిల్లాల పునర్విభజనతో ప్రగతి ముద్ర వేసిండు కేసీఆర్
- సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల ముగింపు సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్
ప్రజల ముంగిట పాలన
‘తెలంగాణ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి. దీనికి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే దుస్థితిని సమూలంగా మార్చేందుకు.. ప్రభుత్వమే ప్రజల ముంగిట్లోకి వెళ్లి సేవలు అందించేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటుచేశాం. గతంలో జిల్లాకేంద్రాలకు పల్లెలు దూరంగా ఉండేవి. సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదురొనేవారు. చిన్న పని కోసం కూడా వందలాది కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఇది ప్రజలను వ్యయప్రయాసలకు గురిచేసేది. ఇప్పుడు ప్రజల ముంగిటకే పాలనను తీసుకొచ్చాం. రాష్ట్ర పరిపాలనా చరిత్రలో ఇది నిలిచిపోతుంది.
-2016 అక్టోబర్ 11వ తేదీన సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభ వేడుకల్లో కేసీఆర్
సిద్దిపేట, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి వల్లే రాష్ట్రం ప్రగతి పథాన పయనించిందని, సిద్దిపేట జిల్లా అభివృద్ధికి కేసీఆర్ వేసిన పునాదే కారణమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పష్టంచేశారు. చరిత్రలో ఒకసారి ఏర్పడే జిల్లా హోదా, ఒకసారి వచ్చే రైలుమార్గం, సాగునీటి ప్రాజెక్టుల వంటి విజయాలు సిద్దిపేట అభివృద్ధిలో శాశ్వతంగా నిలిచిపోతాయని, ఈ విజయాల వెనుక కేసీఆర్ కృషి ఎంతగానో ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, రైతులు, యువత, విద్యార్థులు, పేదల సమస్యల పరిషారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన మూడు రోజుల దశాబ్ది ఉత్సవాల ముగింపు మహాసభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి హరీశ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
ఎమ్మె ల్సీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు బ్రేకులు వేసి, ప్రాజెక్టులను రద్దు చేయడం, రైతులను కష్టాల్లోకి నెట్టడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, విద్యుత్తు ఉత్పత్తి చేయలేక, సాగునీటి ప్రాజెక్టుల మోటర్లు నడుపలేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కరువని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో ఐదేండ్లలోనే అనేక ప్రాజెక్టులు పూర్తిచేశారని, కాలువలు నిండుగా ప్రవహించడం, భూగర్భజలం పెరిగి, సాగుకు 24 గంట ల విద్యుత్తు అందడంతో వ్యవసాయ రంగ ము ఖచిత్రం మారిందని గుర్తుచేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులైందని, కరెంటు కోతలతో మోటర్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

6 గంటల కరెంటుతో కష్టాలు
కేసీఆర్ హయాంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందేదని, ప్రస్తుతం ఆరు నుంచి ఎనిమిది గంటల సరఫరాతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని హరీశ్ వాపోయారు. పాత రోజులు తెస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి నిజంగానే నాటి రోజులను తెచ్చాడని దెప్పిపొడిచారు. మళ్లీ ఆరు గంటల కరెంటు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయే పంటలు కనిపిస్తున్నాయని చెప్పారు. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి సజావుగా సాగేందుకు అవసరమైన బొగ్గు నిల్వలను సమయానికి సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బొగ్గు సరఫరాలో జాప్యం వెనుక అవినీతి, బంధుప్రీతి ఉన్నాయని ఆరోపించారు.
నీళ్లున్నా ఎత్తలే
గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల మోటర్లను నడుపకపోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. తాను ప్రశ్నించిన తర్వాత రంగనాయకసాగర్‌లో కొంతమేర నీటిని నింపారని, అయినా పూర్తిస్థాయి వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు మోటర్లను 24 గంటలు నడపాల్సిన చోట పరిమిత సమయం మాత్రమే నడుపుతున్నారని తెలిపారు. దేవాదుల నుంచి నీరు అందితే చేర్యాల, మద్దూరు, ధూళ్మిట్ట, కొమురవెల్లి ప్రాంతాల్లోని రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నిండటంతో పాటు ఆ ప్రాంతాల్లో పంటలు పండే అవకాశం ఉంటుందని పేరొన్నారు. నీరు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎత్తిపోయకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

పాలమూరు రైతులకు అన్యాయం
తాను పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి అదే ప్రాంత రైతులను సాగునీటి కష్టాల్లోకి నెట్టారని హరీశ్ విమర్శించారు. శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్నా కల్వకుర్తి ప్రాజెక్టు మోటర్లను గతంలో మాదిరిగా నిరంతరంగా నడుపడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించే ప్రయత్నాలు చేస్తుండగా, తెలంగాణలోని పాలమూరు ప్రాంత రైతులకు మాత్రం రేవంత్ పూర్తిస్థాయి నీటిని అందించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుప్పం వంటి దూరప్రాంతాలకు నీటిని తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, కృష్ణా నది సమీపంలోని పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో కల్వకుర్తి, దేవాదుల, కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు సాగునీటి అవసరాలకు అనుగుణంగా పనిచేశాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో రెండు పంటలు పండేలా సాగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వం రైతులను పంటలు వేయొద్దని కోరే పరిస్థితి తెచ్చిందని విమర్శించారు. హుస్నాబాద్ ప్రాంతానికి కీలకమైన గౌరవెల్లి ప్రాజెక్టు పనులు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 98 శాతం పూర్తయ్యాయని, మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలో 30 గ్రామాలకు సాగునీరు అందించే ఇరిగేషన్ లిఫ్ట్ పనులను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
33 జిల్లాలు.. 33 మెడికల్ కాలేజీలు
తెలంగాణలో 33 జిల్లాలను ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిందని హరీశ్ గుర్తుచేశారు. సిద్దిపేటకు జిల్లా హోదా లేకపోతే ఇకడ మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యేదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లా స్థాయి ప్రభు త్వ కార్యాలయాలు, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేం జ్ వంటి సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి రావడానికి జిల్లా ఏర్పాటే దోహదపడిందని చెప్పారు. ఐటీ రంగంలో సిద్దిపేట యువతకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరగా, ఐటీ టవర్ నిర్మించారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సిద్దిపేట ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. వెటర్నరీ కళాశాల సగం పూర్తయిన తర్వాత దాన్ని కొడంగల్‌కు తరలించారని, బాలికల కోసం మంజూరైన ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల భవనాన్ని రద్దు చేశారని చెప్పారు.

కేసీఆర్ ఫ్యాక్టరీ కట్టించిండు .. రిబ్బన్ కటింగ్ రేవంత్
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని కేసీఆర్ కట్టించారని, గత ప్రభుత్వం చేసిన పనులకు రేవంత్‌రెడ్డి రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప చేసిందేం లేదని దెప్పిపొడిచారు. మార్చి 22న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా రైతుబంధు నిధులను 45 రోజుల్లో విడుదల చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారని, అక్టోబర్ 11 నాటికి 200 రోజులు గడిచినా జమ కాలేదని విమర్శించారు. సిద్దిపేట ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలను మర్చిపోలేనని, తన చివరిశ్వాస వరకు ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టంచేశారు.
జిల్లా సాధనకు కృషిచేసిన సేవలను స్మరించుకోవడం, పదేండ్ల ప్రగతిని గుర్తుచేసుకోవడం వేడుకల ఉద్దేశమని తెలిపారు. మహాసభలో దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, సిద్దిపేట తొలి జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, ఎర్రోళ్ల శ్రీనివాస్, బకి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు పాల్గొన్నారు.

జెన్ జీలతో హరీశ్ ముఖాముఖి
సిద్దిపేట అక్టోబర్ 11 : ‘కేసీఆర్ ఫైటర్, విజనరీ ఉన్న నాయకుడు.. మీ గొంతుకనై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తం.. ఇచ్చిన హామీల అమలు కోసం ప్రతిపక్షంగా ప్రశ్నిస్తం’ అని హరీశ్ స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా పట్టణంలోని కోమటిచెరువు నెక్లెస్ రోడ్డు వద్ద జెన్ జీలతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. యువత గంజాయి, ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడుతున్నారని, బెట్టింగ్‌లు పెట్టి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యువత డ్రగ్స్, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ‘కేసీఆర్ విజనరీ లీడర్, పోరాట యోధుడు.. ఒకప్పుడు బెంగాల్ ఏం చేస్తే దేశం అదే ఆచరిస్తది అనే నానుడి ఉండేది.. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఏం చేస్తే దేశం అదే ఆచరిస్తది అనే పరిస్థితి వచ్చింది. అందుకే ఆయన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు’ అని హరీశ్ కొనియాడారు.

సెల్‌ఫోన్ లైట్ల వెలుగులోనే హరీశ్ ప్రసంగం
సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల ముగింపు సభలో విద్యుత్తు అంతరాయం కలకలం రేపింది. వేలాది మంది తరలివచ్చిన ఈ సభలో ఒకసారిగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రాంగణమంతా చీకటిమయమైంది. దీంతో ప్రజలు తమ సెల్ ఫోన్లలో లైట్లు ఆన్‌చేసి వెలుతురు అందించారు. దాదాపు పది నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సెల్ ఫోన్ లైట్ల వెలుగుల మధ్యే హరీశ్‌రావు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

కేసీఆర్ చిత్ర పటానికి గోదావరి జలాలతో అభిషేకం
సభా వేదికపై కేసీఆర్ చిత్ర పటానికి రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు తెచ్చి హరీశ్‌రావు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అభిషేకం చేశారు. జిల్లాకు తొలి కలెక్టర్‌గా పనిచేసి, సిద్దిపేట అభివృద్ధికి కృషిచేసిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, తొలి జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బక్కి వెంకటయ్య, సినీ నటుడు సంపూర్ణేశ్ బాబులను శాలువాలు, జ్ఞాపికలతో హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. అంతకుముందు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సిద్దిపేట గడ్డ మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నది..నాడు తెలంగాణ పోరాటం, కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యమానికి సిద్దిపేట ఎలా వేదికైందో.. రేపు రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి కూడా ఇదే గడ్డ నుంచి ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుంది.
-హరీశ్‌రావు
1983లో ఎన్టీఆర్‌కు ఏ చేత్తోనైతే దరఖాస్తు ఇచ్చారో.. ముఖ్యమంత్రి అయ్యాక అదే చేత్తో సంతకం పెట్టి సిద్దిపేట జిల్లాను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌ది.
-హరీశ్‌రావు
కృష్ణా, గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నా కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల మోటర్లు నడుపకుండా పంటలను ఎండబెట్టినందుకు రేవంత్‌రెడ్డి బేషరతుగా తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి.
-హరీశ్‌రావు
కేసీఆర్ వల్లే సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా కావాలని కేసీఆర్ నాడు ఎన్టీఆర్‌కు వినతి పత్రం ఇచ్చిన చేతితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి జిల్లాను ఏర్పాటు చేసిండ్రు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, లాల్ కమాన్, కొమురవెల్లి మల్లన్న సాగర్, హుస్నాబాద్ ఎల్లమ్మ, కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయాలు, రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట అభివృద్ధి చెందింది. హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాను అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపారు.
-దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
రాష్ర్టానికి సిద్దిపేట జిల్లా ఆదర్శం
జిల్లాల పునర్విభజన చేసి పరిపాలనను ప్రజల ముంగిట్లోకి తెచ్చిన నాయకుడు కేసీఆర్. జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ర్టానికి ఆదర్శంగా నిలిపారు. సిద్దిపేట జిల్లాను అన్నింట్లో ముందుండి నడిపించిన నాయకుడు హరీశ్‌రావు. సిద్దిపేట ప్రజలకు మెడికల్ కాలేజీ తెచ్చారు.
– యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
నీళ్లెత్తక కరువు అంటున్నడు
కృష్ణా, గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే చోద్యం చూసిన ముఖ్యమంత్రి నీళ్లెత్తి ప్రాజెక్టులు నింపకుండా చోద్యం చూసి నేడు ఎల్ నినోతో కరువు వచ్చిందని కుంటి సాకులు చెప్తున్నడు. యాసంగి క్రాప్ హాలిడే అని చెప్తున్న రేవంత్‌రెడ్డిని ప్రజలు ప్రశ్నించాలి. దాదాపు మూడేండ్లలో నియోజకవర్గానికి వంద రూపాయలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
బీఆర్ఎస్ను అధికారంలోకి తెద్దాం
గజ్వేల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కేసీఆర్, హరీశ్‌రావు ఎంతగానో కృషి చేశారు. ఎడ్యుకేషనల్ హబ్, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. 10 ఏండ్లలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నరు. సిద్దిపేటలో హరీశ్‌ను, గజ్వేల్‌లో కేసీఆర్‌ను రికార్డు మెజార్టీతో గెలిపించి మళ్లీ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొద్దాం.
-వంటేరు ప్రతాపరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి
కాంగ్రెస్ వల్లే జాప్యం
సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాతనే హుస్నాబాద్‌కు ఆర్డీవో కార్యాలయం వచ్చింది. పట్టణం అభివృద్ధి చెందింది. గౌరవెల్లి రిజర్వాయర్‌ను హుస్నాబాద్ వరప్రదాయినిగా మార్చేందుకు కేసీఆర్ కృషి చేశారు. 98% పనులు పూర్తయిన ప్రాజెక్టుపై కేసులు వేసిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చాక పనులను పడావు పెట్టారు. పూర్తయి ఉంటే హుస్నాబాద్ ప్రాంతం గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారేది.
-వొడితెల సతీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే, హుస్నాబాద్
కాంగ్రెస్ చెప్పేదొకటి చేసేదొకటి
మనకన్నా ముందు ఏర్పడిన రాష్ట్రాల కంటే తెలంగాణ నేడు దేశంలో ముందంజలో ఉన్నదంటే దానికి కారణం కేసీఆర్. ఈ సభను చూస్తుంటే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి. కాంగ్రెస్ చెప్పేదొకటి చేసేదొకటి. కేసీఆర్, హరీశ్‌రావు వల్లే సిద్దిపేట అభివృద్ధి సాధ్యమైంది.
– ఫారూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ
21 నూతన జిల్లాల ఆవిర్భావం.. ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వ యంత్రాంగం
‘తెలంగాణ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం. పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి. దీనికి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే దుస్థితిని సమూలంగా మార్చేందుకు.. ప్రభుత్వమే ప్రజల ముంగిట్లోకి వెళ్లి సేవలు అందించేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటుచేశాం. గతంలో జిల్లా కేంద్రాలకు పల్లెలు దూరంగా ఉండేవి. సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదురొనేవారు. చిన్న పనుల కోసం కూడా వందలాది కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఇది ప్రజలకు వ్యయప్రయాసలకు గురిచేసేది. ఇప్పుడు ప్రజల ముంగిటకే పాలనను తీసుకొచ్చాం. రాష్ట్ర పరిపాలనా చరిత్రలో ఇది నిలిచిపోతుంది.
-2016 అక్టోబర్ 11వ తేదీన సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభ వేడుకల్లో కేసీఆర్
పల్లెప్లలెకూ పాలనా వికేంద్రీకరణ.. డివిజన్లు, మండలాల పటిష్టీకరణ
జిల్లాల విభజన అంటే కేవలం పైపై మార్పులతో కాకుండా అట్టడుగు స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తాం. ఇందుకు 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 నూతన మండలాలను ఏకకాలంలో ఏర్పాటుచేశాం. పాలనా వికేంద్రీకరణను పల్లెపల్లెకూ విస్తరించాం. క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తేచ్చాం. తద్వారా భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు, సర్టిఫికెట్ల మంజూరు వంటి రోజువారీ పౌరసేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా సమస్యల పరిషారమే ప్రభుత్వ అంతిమ లక్ష్యం .
-2016 అక్టోబర్ 11వ తేదీన సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభ వేడుకల్లో కేసీఆర్
పటిష్టమైన ఆర్థిక వృద్ధి సంక్షేమానికి నిధులు సమృద్ధి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత పటిష్టంగా, స్థిరంగా ఉండేలా ప్రణాళికలు తయారు చేశాం. దేశవ్యాప్తంగా చూస్తే మన రాష్ట్రంలో పన్నుల వృద్ధిరేటు దాదాపు 15 శాతంగా కొనసాగుతున్నది. ఇది మన ఆర్థిక బలానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనాలు గణనీయంగా పెరిగి లక్షల కోట్లకు చేరుకుంటాయి. అందువల్ల ప్రజా సంక్షేమానికి గానీ, కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గానీ నిధుల కొరత అనే మాటే ఉండబోదు.
-2016 అక్టోబర్ 11వ తేదీన సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభ వేడుకల్లో కేసీఆర్
శతాబ్దాల నాటి ఫ్యూడల్ పాలనా పద్ధతికి శాశ్వత స్వస్తి
నిజాం కాలం నాటి పాత పరిపాలనా వ్యవస్థకు స్వస్తి పలుకుతాం. సుమారు వందేండ్ల కిందటిబ్రిటీష్, ఫ్యూడల్ పద్ధతులతో ఇప్పటి ప్రజాస్వామిక సమాజానికి న్యాయం జరుగదు. కాలంచెల్లిన చట్టాలు, పాత బారికేడ్ల వంటి నిబంధనల స్థానంలో ఆధునిక, పౌర కేంద్రీకృత ప్రజాస్వామిక విధానాలు అమలు చేస్తాం. ప్రజల హకులు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్మాణం ఉంటుంది. పాత ఫ్యూడల్ శృంఖలాలను తెంచేస్తూ, సరికొత్త అభివృద్ధి భావజాలంతో ముందుకు సాగేలా చేస్తాం. అందుకే జిల్లాల పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాం.
-2016 అక్టోబర్ 11వ తేదీన సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభ వేడుకల్లో కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- development
- harish rao
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

