సంగారెడ్డి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తలచుకుని కుంగిపోవద్దని, ధైర్యంగా ముందుకు సాగుదామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తూ ప్రజల గొంతుక అవుదామని పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతా సభలు నిర్వహించింది. సంగారెడ్డి సభలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, జహీరాబాద్ సభలో ఎమ్మెల్యే మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు. సభల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. గెలవలేదని ఎవరూ కుంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఓటమి తాత్కాలికమేనని, కేసీఆర్ నాయకత్వంలో వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో విజయం మనదేనని భరోసా ఇచ్చారు.
పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లతో బీఆర్ఎస్ అధికారానికి దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని జనం నమ్మారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినందున వారి పక్షాన నిలబడదామని పిలుపునిచ్చారు. ప్రజల గొంతుకై వారి పక్షాన పనిచేద్దామని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా చూద్దామని, నెరవేర్చకుంటే పోరాడదామని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఏడుగురు గెలిచారని, తాము కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలు, పార్టీ శ్రేణుల వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి ఏడుచోట్ల పార్టీ అభ్యర్థులను గెలిపించారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పదిసీట్లు గెలుస్తామని అనుకున్నా మెదక్, నారాయణఖేడ్‌లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవాల్సి వచ్చిందని చె ప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని తెలిపారు. సంగారెడ్డి, జహీరాబాద్‌లో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు గెలుపుకోసం పార్టీశ్రేణులు ఐక్యంగా పనిచేశాయని అ భినందించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో చింతా ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేకున్నా ప్రతి నాయకుడు, కార్యకర్త తామే అభ్యర్థిగా భావించి ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేసినట్టు చెప్పారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేసీఆర్ తెలంగాణ సాధించారని, అదే స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు. రా ష్ర్టాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశారని, కరెంటు, సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరించారని కొనియాడారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలో అగ్రభాగాన నిలిచిందని, అడవుల విస్తీర్ణం 7.7 శాతానికి పెరిగిందని తెలిపారు. త్యాగాల పునాదుల మీద నిర్మించిన తెలంగాణపై కేసీఆర్‌కు, మనకు ఉన్న ప్రేమ మరెవరికీ ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో తొందరపడొద్దని, అది ఏం చేస్తుందో వేచి చూద్దామని సూచించారు. సభల్లో జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, నరోత్తం, తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సం గారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, నాయకు లు మాణిక్యం, జైపాల్‌రెడ్డి, హకీం, ముఖీమ్, నరహరిరెడ్డి, కాసాలబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.