Harish Rao | సిద్దిపేట : వరి పంట వేసిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. తడిసిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొంటామని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం రూ. 10 వేలు అందిస్తామన్నారు.
ఏప్రిల్, మే నెలల్లో భారీ వర్షాలు కురియడంతో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టోయారు. దీంతో మార్చి నెలలో వరిసాగు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు గానూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎల్లప్పుడూ రైతులందరికీ కేసీఆర్ అండగా ఉంటారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకే తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశాలు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.