చేర్యాల, జనవరి 4 : సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు దివంగత శెట్టె మల్లేశం కుటుంబానికి రూ.16.10 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మల్లేశం ఇటీవల దారుణహత్యకు గురైన విషయం తెల్సిందే. బుధవారం చేర్యాలలోని కల్యాణి గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ తదితరులు నివాళులర్పించారు.
మల్లేశం కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రూ.5 లక్షలు, జడ్పీటీసీ సభ్యులు రూ.2.10 లక్షలు, నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి రూ.లక్ష, మద్దూరు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి రూ.లక్షతోపాటు నియోజకవర్గంలోని పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు రూ.7 లక్షలను ప్రకటించారు. సేకరించిన రూ.16.10 లక్షలను ఆయన కూతుర్ల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.