హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కొరడా ఝుళిపిస్తున్నది. గత డిసెంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 80 పరిశ్రమలను మూసివేసింది. వీటిలో రసాయన, ఫార్మా పరిశ్రమలతోపాటు, స్టోన్క్రషర్లు, పౌల్ట్రీఫారాలు, బ్యాటరీ, మెటల్, మినరల్స్, హాట్మిక్స్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ నెలలోనే ఇప్పటి వరకు మూడు పరిశ్రమలను మూసివేస్తూ పీసీబీ ఆదేశాలు ఇచ్చింది. వీటిలో కొన్ని కాలుష్యకారక పరిశ్రమలు కాగా, మరొకటి లైసెన్స్ పొందకుండా నిర్వహిస్తున్నది. అంతేకాకుండా రసాయన వ్యర్థాలను అక్రమంగా డంప్ చేస్తున్న, తరలిస్తున్న ట్యాంకర్లపైనా పీసీబీ కఠినంగా వ్యవహరిస్తున్నది.