హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఇటీవల కొందరు కల్తీకల్లు తాగి మరణించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆగస్టు 20లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని రెవెన్యూ (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని ఆదేశించింది. కల్తీకల్లు వల్ల సంభవించిన మరణాలపై పత్రికల్లో వచ్చిన వార్తాకథనాల ఆధారంగా న్యాయవాది రామారావు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్హెచ్ఆర్సీ.. కల్తీ కల్లుకు ఎంతమంది బలయ్యారు? ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోయ్యాయి? ఎన్ని కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు? ఆ మరణాలకు బాధ్యులైన అధికారులపై ఎటువంటి చర్యలు చేపట్టారు? మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించారా? కల్తీ కల్లును నిరోధించేందుకు ఇకపై ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? అనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆల్ఫ్రాజోలం, డైజోపామ్ లాంటి మత్తుపదార్థాలతో కల్తీకల్లు తయారు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంటూ.. మృతులకు రూ.10 లక్షలు, తీవ్ర అనారోగ్యం పాలైనవారికి రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించే అంశాన్ని సూచించింది.