హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది, డబ్బులు ఇచ్చి పదవులు తీసుకుంటున్నారు’ అంటూ మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ టీపీసీసీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. అయితే షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ‘నా ఆస్తులు, నా వ్యక్తిత్వం నేనేంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు, ఇన్నాళ్లూ రాజకీయాల్లో ఉండి షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదు’ అని అభిప్రాయపడ్డారు.
కాగా, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై బాధిత నాయకురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఒక మహిళగా తనకు సమాజంలో గుర్తింపు, ఆదరణను చూసి ఓర్వలేకనే కొందరు పనిగట్టుకొని సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యమైన, అవమానకరమైన రీతిలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. అంతేగాక భయపెట్టేలా, బెదిరించేలా మెస్సేజ్‌లు పంపుతూ మానసికంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక మహిళను చులకన చేస్తూ షబ్బీర్ అలీ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆడబిడ్డలకు కాంగ్రెస్ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు.