Congress | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తన వర్గం ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కనుసన్నల్లో మరో కొత్తవర్గం ఏర్పడ్డట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన తన సొంత బంధువర్గం మహిళలకే పదవులు ఇస్తూ.. కొత్త మహిళా వర్గాన్ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. గతవారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతలు చేసిన ధర్నాలు, ప్రతిధర్నాలతో వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ పోస్టుల్లో, పీసీసీ కార్యవర్గంలో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, టీపీసీసీ అధ్యక్షుడు తన బంధువులకే పదవులు ఇచ్చుకుంటున్నారని ఆరోపిస్తూ.. సునీతారావు నేతృత్వంలో గత వారం గాంధీభవన్‌లోని టీపీసీసీ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. మహేశ్‌కుమార్‌గౌడ్ తన చెల్లెళ్లకు, మరదళ్లకు, బంధవులకు మాత్రమే పదవులు ఇచ్చుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
ఆ మరుసటి రోజు సునీతారావుకు వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మహిళలు కొందరు నినాదాలు చేయడం ఆసక్తిగా మారింది. వారు కూడా గాంధీభవన్ మెట్లపై కూర్చొని ధర్నా చేశారు. ‘సునీతారావు హఠావో.. మహిళా కాంగ్రెస్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. ఆమెతో పార్టీకి నష్టం జరుగుతున్నదని వారు ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు పార్టీ పెద్దలకు లేఖలు రాసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సునీతారావుకు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌పై చేసిన వ్యాఖ్యలు, గాంధీభవన్‌లో ధర్నా చేయడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుబట్టింది. నోటీసుపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కాంగ్రెస్ ఆదేశించింది. ఈ షోకాజ్ నోటీసులపై సునీతారావు వర్గం మండిపడుతున్నది. గాంధీభవన్‌లో రెండు వర్గాలు ధర్నాలు చేసినప్పుడు ఒక్క సునీతారావుకు మాత్రమే నోటీసులు ఇవ్వటం ఏమిటని ఆమె వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. మహిళా కాంగ్రెస్‌లో చీలికలు తెచ్చిన నేత మీద చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.