హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఓవైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేయడం ఏమిటని ప్రభుత్వా న్ని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. రాష్ట్రంలో నియంతృత్వపాలనకు నిర్బంధాలు నిలువుటద్దంగా మారాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎకడికకడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని శుక్రవారం ఎక్స్‌వేదికగా ఖండించారు. ‘బీఆర్ అంబేదర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు వెళ్లనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకు? మీ అప్రజాస్వామిక వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేదర్ సైతం నివ్వెరపోతున్నరు’ అంటూ మండిపడ్డారు. అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నాడు ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నిలదీశారు. ‘రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించకుండా ఇంత నిర్బంధమా? ఇది ప్రజా ప్రభుత్వమా? ప్రజలను హింసించే ప్రభుత్వమా?’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాం గం కల్పించిన హక్కులను కాలరాయడం రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా?’ అని నిలదీశారు. ఇదేం ప్రజాపాలన?’ అని భగ్గుమన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న కోపంతో కనీసం దండ వేయకుండా భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడం క్షమించరాని నేరమని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై కక్ష, కార్పణ్యాలతో దేశానికి తలమానికమైన నేత విగ్రహం వర్ధంతి రోజు కూడా దండలేకుండా బోసిపోయి కనిపించడం దారుణమని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు.