హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా లేఖ పంపింది. ఆర్టీసీలో ఉద్యోగ సంఘాల రద్దుకు నిరసనగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు దశలవారీ పోరాటాలు సాగించారని యూనియన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న పేర్కొన్నారు.
ఆర్టీసీ సంఘాలపై ఆంక్షలను ఎత్తివేస్తామని చెప్పి.. రెండేండ్లు గడుస్తున్నా, ఆ ఊసే ఎత్తడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దయిన 9 ఉద్యోగ సంఘాలకు తిరిగి గుర్తింపునిస్తూ ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, అందులో ఆర్టీసీ సంఘాల గుర్తింపును విస్మరించడం పట్ల.. కార్మికవర్గం తీవ్ర అసహనానికి గురైందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపార్టుమెంట్లతోపాటు సింగరేణి, విద్యుత్తుశాఖ, వివిధ కార్పొరేషన్లలో సంఘాలను అనుమతిస్తూ.. ఆర్టీసీ సంఘాలను విస్మరించడం, డిపోలలో అధికారుల వేధింపులు, అణచివేతల వల్ల కార్మికవర్గం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని వాపోయారు. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా కార్మిక సంఘాలపై వివక్ష చూపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాబట్టి ఆర్టీసీ సంస్థకు ఒక పైసా కూడా ఖర్చు లేని, ఆర్థిక భారం అసలే లేని కార్మిక సంఘాలపై ఆంక్షలను వెంటనే ఎత్తివేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.