హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): సుంకిశాల ప్రాజెక్టులో నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే రిటైనింగ్‌వాల్ కూలినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జలమండలి చేపట్టే ప్రతి ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటుంది. గతంలో శివారు మున్సిపాలిటీలలో హడ్కో రుణంతో చేపట్టిన రూ.1200 కోట్ల తాగునీరు, మురుగునీటి పారుదల ప్రాజెక్టు పనులు, మురుగునీటి శుద్ధి పనులపై క్షేత్రస్థాయి అధికారులపై ఆధారపడలేదు.
పనులు జరుగుతున్న ప్రతి సైట్లలో సీసీ కెమెరాలను బిగించి ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేశారు. రోజూ ప్రాజెక్టు డైరెక్టర్, ఎండీలు తమ చాంబర్లో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ ద్వారా పనులను పర్యవేక్షించారు. తద్వారా పనుల నాణ్యతతోపాటు సంబంధిత ఎజెన్సీ లోపాలను పసిగట్టడం మందలించడం, చర్యలు తీసుకోవడం లాంటి వాటితో ప్రాజెక్టులను పూర్తి చేశారు. సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో మాత్రం అధికారులు ఇవేవీ చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.