PDS Rice | హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కొరత ఏర్పడింది. ఫిబ్రవరి నెలాఖరులోగా రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం మార్చి 12 వరకు అందలేదు. దీంతో సకాలంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. రేషన్ బియ్యం ఇంకెప్పుడస్తాయంటూ రేషన్ షాపుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వాప్తవానికి ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి ప్రతినెలా చివరి తేదీలోగా రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేస్తే మరుసటి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. కానీ, గత రెండు నెలల నుంచి అలా జరగడం లేదు. ఈ నెలలో మరింత ఇబ్బంది ఎదురవుతున్నట్టు రేషన్ డీలర్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17,200 వరకు రేషన్ షాపులు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 40% షాపులకు కూడా బియ్యం అందలేని తెలిసింది. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొడ్డుబియ్యం పంపిణీకే ఇన్ని ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఇక సన్న బియ్యం ఎలా పంపిణీ చేస్తుందోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నిల్వలు లేకపోవడం వల్లే..
గోదాముల్లో బియ్యం నిల్వలు నిండుకోవడం వల్లే రేషన్ బియ్యం పంపిణీ ఆలస్యమవుతున్నట్టు తెలిసింది. గత 2-3 నెలలుగా పంపిణీకి అవసరమైన బియ్యం సేకరణలో అధికారులు విఫలమైనట్టు సమాచారం. కానీ, బియ్యం కొరతకు అధికారులు సన్నబియ్యాన్ని సాకుగా చూపుతున్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో దొడ్డుబియ్యం నిల్వలు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్తున్నారు. సన్నబియ్యం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తే మాత్రం.. తెలియదని, ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని చెప్తుండటం గమనార్హం. దీంతో బియ్యం కొరతను కప్పిపుచ్చేందుకు అధికారులు రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం వల్లనే బియ్యం పంపిణీ ఆలస్యమైందనే అభిప్రాయాలు పౌరసరఫరాల శాఖలో వ్యక్తమవుతున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల గోదాముల్లో అవసరమైన నిల్వలు లేక ఎంఎల్ఎస్ పాయింట్స్‌కు బియ్యం సరఫరా ఆలస్యమైనట్లుగా తెలిసింది. ప్రతినెలా చివరి తేదీలోగా ఎంఎల్ఎస్ పాయింట్స్‌కు రావాల్సిన బియ్యం.. ఈ నెలలో 5వ తేదీ తర్వాత ప్రారంభమైంది. కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే సరఫరా అవుతున్నట్టు సమాచారం.
సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి?
రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యానికి బదులు సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. తొలుత జనవరి నుంచి ఇస్తామని, ఆ తర్వాత సంక్రాంతి నుంచి అని ప్రకటించింది. తాజాగా ఈ గడువును ఉగాదికి పెంచింది. కానీ, ఉగాది నుంచైనా పంపిణీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత కొరవడింది. సన్నబియ్యంపై ప్రభుత్వం రేషన్ డీలర్లకు గానీ, ఎంఎల్ఎస్ పాయింట్స్‌కు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఉగాది నుంచి పంపిణీ చేయడం కష్టమేనని సివిల్ సప్లయ్ అధికారులు చెప్తున్నారు. ఈ వానకాలం సీజన్లో ప్రభుత్వం 24 లక్షల టన్నుల సన్నవడ్లు కొనుగోలు చేసింది. వీటి ద్వారా 16 లక్షల టన్నుల సన్నబియ్యం ఉత్పత్తి అవుతాయి. రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల 2 లక్షల టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 16 లక్షల టన్నుల సన్నబియ్యం 8 నెలలకే సరిపోతాయి. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటనే దానిపై అధికారులతోపాటు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. యాసంగిలో అధికంగా దొడ్డు ధాన్యమే పండిస్తారు.. సన్నధాన్యం వచ్చేది తక్కువే కాబట్టి పంపిణీలో ఇబ్బంది తప్పదని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే సన్నబియ్యం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు.