హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ పాలన శాపంగా పరిణమించింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులకు సకాలంలో మందులు, సరైన చికి త్స అందడమే లేదని రోగులే గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తో డు ఎంఎన్‌జే దవాఖాన అధికారుల అసమర్థత కారణంగా క్యాన్సర్ రోగులకు చికిత్స అందని ద్రాక్షగా మారుతున్నది. దవాఖానలో రోగులకు అవసరమైన మందులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో సరైన చికి త్స ఇవ్వకపోవడంతో క్యాన్సర్ వ్యాధి ముదరడంతోపాటు, తిరగబెడుతున్నది. దీంతో రోగులు దినదిన గండంగా జీవిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో మరోసారి కీమో థెరపీ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. దీంతో అక్కడి సిబ్బంది రోగులను ‘నో స్టాక్’ పేరుతో వెనక్కి పంపుతున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితి ఆధారంగా రకరకాల కీమో ఇంజెక్షన్లను ఇస్తుంటారు. ఇందులో భాగంగానే కొందరు క్యాన్సర్ రోగులకు ‘కార్బోప్లాటిన్-450 ఎంజీ’ అనే కీమో ఇంజెక్షన్‌ను ప్రతి 3 వారాలకు ఒకసారి ఇస్తుంటారు. గత కొన్ని రోజుల నుంచి దవాఖానలో ఆ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. దీంతో కీమో థెరపీ కోసం రోగులకు నిరీక్షణ తప్పడం లేదు.
అనారోగ్యం.. ఆర్థిక భారం
మూడు వారాలకు ఒకసారి ఇవ్వాల్సిన కీమో ఇంజెక్షన్లను అదనంగా వారం పది రోజులపాటు వాయిదా వేస్తుండటంతో ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు అదనంగా ఆర్థికభారం తప్పడం లేదు. కీమోథెరపీ ఇవ్వాలంటే రోగులు మూడు రోజులపాటు దవాఖానలోనే ఉండాల్సి ఉంటుంది. మొదటిరోజు అవసరమైన రక్త పరీక్షలు చేయించుకొని, ఆరోగ్యశ్రీ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. రెండో రో జు వైద్యపరీక్షల నివేదికలతోపాటు ఆరోగ్యశ్రీ అప్రూవల్ వస్తే.. మూడో రోజు వారికి కీమో ఇంజెక్షన్లు ఇస్తారు. ఇలా మూడు రోజులుగా ఉన్న రోగులకు తీరా కీమో ఇవ్వాల్సిన రోజున ‘నో స్టాక్’ పేరు తో తిప్పి పంపుతుండటంతో రోగులకు భారమవుతున్నది. ఆర్థికభారంతోపాటు ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉన్నది.
కొత్త టెండర్లను తెరువకపోవడంతో..
కీమో చికిత్సకు అవసరమయ్యే ఔషధాలు సరఫరా చేసే కంపెనీల టెండర్ కాలపరిమితి నెల రోజుల క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త టెండర్లను ఆహ్వానిస్తూ దవాఖాన యాజమాన్యం నెల క్రితమే నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో పలు ఫార్మా కంపెనీలు టెండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తయినప్పటికీ కొత్త టెండర్లను ఓపెన్ చేయకపోవడం, గత సరఫరాదారు మందులను సరఫరా చేయకపోవడంతో దవాఖానకు కీమో ఇంజెక్షన్ల సరఫరా నిలిచిపోయి, కొరత ఏర్పడింది. గతంలో సుమారు రూ.1,350కి ఒక ఇంజెక్షన్ చొప్పున పాత కంపెనీ సరఫరా చేసింది. ఔషధాల ధరలు పెరగడం, టెండర్ కాలపరిమితి ముగియడంతో సదరు కంపెనీ ఔషధాల సరఫరాను నిలిపివేసింది. పాత ధరలకే ఔషధాలు సరఫరా చేయడం కుదరదని తేల్చిచెప్పింది. పాత కంపెనీల కాలపరిమితి ముగిసేలోపే కొత్త టెండర్లను ఖరారు చేయాల్సిన దవాఖాన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జాప్యం చేయడంలో ఎవరి స్వలాభం కోసం, ఎవరి కనుసైగల్లో పనిచేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. క్యాన్సర్ రోగులకు సకాలంలో మందులు, వైద్య పరీక్షలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మందుల కొరత, వైద్య పరికరాలు పనిచేయకపోవడం లాంటి సమస్యలున్నా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగానీ, ప్రభుత్వ ఇతర పెద్దలు గానీ దృష్టి పెట్టకపోవడంపై రోగులు, సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.