ఖమ్మం, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గురుకులాలపై సర్కారు అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు ప్రాణసంకటంగా మా రుతున్నది. గత ఏడాది కాలంలోనే సుమారు 40 మంది విద్యార్థుల మరణాలు పరిస్థితికి అద్దం పడుతున్నది. ఓ వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థినిని 11 సార్లు ఎలుకలు కొరకడం కలకలం రేపింది. ఈ ఘటన గత నెలలో జరగ్గా, విరుగుడుగా వేసిన వ్యాక్సిన్ల కారణంగా విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా మారడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాకేంద్రంలోని ముస్తాఫానగర్కు చెందిన సముద్రాల లక్ష్మీభవానీకీర్తి రఘునాథపాలెం మండలం దానవాయిగూడెం బీసీ గురుకుల బాలికల సంక్షేమ వసతిగృహంలో పదో తరగతి చదువుతున్నది. గత నెలలో హాస్టల్లో రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆమెను ఎలుకలు కొరకడంతో తీ వ్రంగా గాయపడింది. ఆ తర్వాత విద్యార్థినికి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో రేబీస్ టీకా వే యించి, విషయం బయటకు పొక్కకుండా జా గ్రత్తపడ్డారు. వారం రోజుల క్రితం విద్యార్థిని తన తల్లికి ఫోన్ చేసి పరిస్థితిని చెప్పుకుంది. వెంటనే ఆమె హాస్టల్కు చేరుకొని కీర్తిని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లింది. డాక్టర్లు పరీక్షించి ‘ఎలుకలు కొరకడంతో నరాలు చచ్చుబడ్డాయి. అందుకే కాళ్లూ చేతులకు స్పర్శ ఉండడం లే దు.’ అని తేల్చారు. వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం కొంత ఆరోగ్యం మెరుగైంది. దీనిపై విద్యార్థిని తల్లి.. హాస్టల్ నిర్వాహకులను ఆరా తీయగా, ‘ఎలుకలు కొరికిన వెంటనే రేబి స్ టీకా వేయించాం. ఇక మాకేం సంబంధం లేదు’ అంటూ తప్పించుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం బాలిక, ఆమె తల్లితో మాట్లాడా రు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వద్ద ఆరా తీశా రు. అనంతరం దవాఖాన వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎలుకలు కొరికాయని తాను చెబితే హాస్టల్ అధికారులు 15సార్లు వ్యాక్సిన్ వేయించారని విద్యార్థిని చెప్పిందని పేర్కొన్నారు. అవి వికటించడం వల్లనే ఆమెకు ప్రాణాపాయస్థితి వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కీర్తికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. విషయం తెలుసుకున్న వద్దిరాజు.. మంగళవారం ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు.
నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 17 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి మైనార్టీ గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి విద్యార్థులు క్యాబేజీ కర్రీతో భోజనం చేశారు. ఇందులో శివవర్ధన్, సాయినాథ్, సైఫ్, నిమ్రాన్, నోమన్లకు అర్ధరాత్రి కడుపునొప్పి రావడంతోపాటు విరేచనాలు కావడంతో మంగళవారం ఉదయం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల దవాఖానలో చికిత్స అందించి సాయంత్రం డిశ్చార్జి చేశారు. మంగళవారం సాయంత్రం మరో ఐదుగురు సోహెల్, బిలాల్, షేక్ అయానుద్దీన్, షేక్ హసీం, అబ్దుల్ మీసన్ కూడా కడుపునొప్పి, విరేచనాలతో దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. విద్యార్థుల అనారోగ్యానికి ఫుడ్ పాయిజన్ కారణం కాదని కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ స్థాయి సమన్వయకర్త విచారణ నివేదిక ప్రకారం సోమవారం సాయంత్రం ఐదుగురు విద్యార్థులు అతిగా స్నాక్స్, ఆహారం తీసుకోవడం వల్ల స్వల్ప అనారోగ్యానికి గురైనట్టు పేర్కొన్నారు. అయితే మంగళవారం అస్వస్థతకు గురైన మరో ఐదుగురి అంశాన్ని కలెక్టర్ ప్రస్తావించకపోవడం గమనార్హం.
తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులచే పాఠశాలలో గ్రానైట్ రాళ్లను మోయిస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ కంట పడింది. ఉపాధ్యాయులు గ్రానైట్ రాళ్లను తొమ్మిదో తరగతి విద్యార్థులు చేత మోయిస్తూ బడి లోపల ఖాళీ ప్రదేశంలో ఉన్న పూలమొక్కల చుట్టూ పెట్టించారు.