Ration Cards | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రకటన జనాలకు నిరాశనే మిగిల్చింది. దరఖాస్తులు స్వీకరించాలని శుక్రవారం పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించడంతో శనివారం జనం మీ సేవ కేంద్రాలకు పరుగులు తీశారు. మళ్లీ ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను ఎప్పుడు నిలిపివేస్తుందో అనే ఆందోళనతో ఉద యం నుంచే మీ సేవ కేంద్రాల ముం దు బారులుతీరారు. కొత్త కార్డులు మంజూరవుతాయని ఆశతో కొందరు, కార్డుల్లో మార్పుల కోసం మరికొందరు రోజంతా నిరీక్షించారు. మీసేవ కేంద్రాలకు పరుగులు పెట్టిన జనాలకు అధికారుల ఝలక్ ఇచ్చారు. దరఖాస్తులు తీసుకోవడం లేదంటూ చేతులెత్తేశారు. దరఖాస్తులు స్వీకరించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తేల్చిచెప్పారు. గ్రామసభల్లో దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్‌కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నదని, మీ సేవలో దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసిందని నోటీసులు పెట్టారు.. దీంతో మీ సేవ కేంద్రానికి వచ్చిన జనాలు నిరుత్సాహంతో వెనుతిరిగారు. ప్రభుత్వ తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. దరఖాస్తుల గోల ఏంటో అర్థంకావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల ప్రక్రియంతా గందరగోళంగా మారింది. మీ సేవ, సివిల్‌సైప్లె అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే గందరగోళానికి కారణమని ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ప్రభుత్వానికి తెలియకుండానే సివిల్‌సైప్లె అధికారులు మీ సేవకు లేఖ రాసినట్టుగా తెలిసింది. దీంతో మీ సేవ అధికారులు ప్రభుత్వాన్ని సంప్రదించగా దరఖాస్తులకు అవకాశమివ్వొద్దని అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలతో మీ సేవ అధికారులు దరఖాస్తు స్వీకరణకు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ప్రభుత్వ పెద్దలు సివిల్‌సైప్లె అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారని, దరఖాస్తు కోసం ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించినట్టుగా తెలిసింది.
ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని చానళ్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రేషన్‌కార్డుల దరఖాస్తుల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వంపై ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నారని, కులగణనలో వివరాలు నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. గ్రామసభల పేరిట డ్రామా చేశారని మండిడ్డారు. మళ్లీ ఇప్పుడు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని అనడమేంటని సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పథకాల పేరిట ఇన్నాళ్లు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీయేనా? అని ప్రశ్నించారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు, దస్త్రం లేకుండా రాష్ట్రంలో పథకాల అమలు జరిగిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు రేషన్‌కార్డులు, పథకాలు అందించాలనే ఆలోచన కంటే కోతలతో ఎలా అందకుండా చేయాలన్న దానిపైనే ప్రభుత్వం దృష్టి ఉందని ఎద్దేవాచేశారు. దరఖాస్తుల పేరిట కాలయాపన చేయడం మానుకుని, పేదలకు పథకాలు అందజేయాలని హితవు పలికారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, ఆత్మీయభరోసా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.