జగిత్యాల : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలయ్యింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ కోటిలింగాల లో కోటేశ్వర స్వామిని, ధర్మపురి రాజేశ్వరాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు స్వాగతం పలికి సన్మానించారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగల గూడెం శ్రీ మహాదేవ మార్కండేయ స్వామి దేవాలయం లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , నల్గొండ జడ్పీ ఫ్లోర్ లీడర్, తిప్పర్తి జట్పీసీపీ పాశం రాం రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు శ్యామ్ సుందర్ , బీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ శివాలయం లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో..
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు అమృత గుండంలో స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు.