న్యూఢిల్లీ, జూన్ 20: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇప్పటికీ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోవటానికి ప్రతిపక్షాల వ్యూహంలో నెలకొన్న లోపమే కారణమని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో చొరవ తీసుకొని ముందుకొచ్చిన నేతలు నడిపించాల్సినంత సమగ్రంగా నడిపించలేదని అంటున్నారు. ప్రతిచోటా అయోమయం, అస్పష్టత కొట్టొచ్చినట్టు కనిపించాయని పేర్కొంటున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అభ్యర్థిని ఖరారు చేయటానికి విపక్షాలు నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్‌ను ఆహ్వానించి ఉండాల్సింది కాదని అంటున్నారు.
అభ్యర్థిపై ముందుగా ఏకాభిప్రాయానికి వచ్చి, ఆ తర్వాత పేరు ప్రకటిస్తే బాగుండేదని చెప్తున్నారు. ముందుగానే పేర్లు ప్రచారం చేయటంతో లాభంకంటే నష్టమే ఎక్కు వ జరిగిందని విశ్లేషిస్తున్నారు. విపక్ష అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహిస్తున్న సమావేశాల్లో కీలకంగా మారిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసినట్టు సమాచారం. ‘అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాకుండా పేర్లు ముందుగా బయటపెట్టరాదన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వాదనే కరెక్టు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆయన సూచనను పరిగణనలోకి తీసుకొంటే బాగుండేది. సమావేశానికి కేసీఆర్‌ను రప్పించలేకపోవటం పెద్ద లోపం’ అని తన పార్టీ సన్నిహితులతో అన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
కాంగ్రెస్‌కు లేని ప్రాధాన్యం
విపక్షాల ఉమ్మడి రాష్టప్రతి అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీకి లేని ప్రాధాన్యం ఇచ్చినట్టు పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. చాలా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్నది. అలాంటప్పుడు ఆ పార్టీల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్‌తో ఒకే వేదికపైకి రావాలని కోరటం అర్థరహితమని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకూ క్షీణించిపోతున్న కాంగ్రెస్‌కు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమావేశాల్లో విషయంలో అంత ప్రాధాన్యం ఇవ్వటం ముమ్మాటికీ రాజకీయ వ్యూహ లోపమేనని అంటున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుగా శరద్పవార్నే నిలబెట్టాలని భావించినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వాలపై విపక్షాలు లీకులిచ్చాయి. పార్టీల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం రాకముందే భారీ ఎత్తున ప్రచారం కావటంతో వారిద్దరూ రాష్ట్రపతి అభ్యర్థి ఆఫర్‌ను తిరస్కరించారు.