Shanti Kumari | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన కే రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే పదవి విరమణ చేయబోతున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారిని ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHDR) వైస్ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు సోమవారం జీవోను జారీ చేసింది. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం ఆమె ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అదే సమయంలో ఆమె ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ (GD)గా సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
శాంతికుమారి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2023 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఆమెను సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె తెలంగాణ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రికార్డులకెక్కారు. శాంతి కుమారి మెరైన్ బయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్, యునైటెడ్ స్టేట్స్లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశారు. మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, సిల్ డెవలప్మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్‌గా, మెదక్ కలెక్టర్‌గా, ఇంధన శాఖ, సాంఘిక సంక్షేమశాఖల్లో డిప్యూటీ సెక్రటరీగా, డైరెక్టర్‌గా, సర్వే సెటిల్మెంట్ విభాగంలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల్లో కమిషనర్‌గా, జాయింట్ సెక్రటరీగా, సెర్ప్ అదనపు సీఈవోగా పనిచేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015 మే నుంచి 2018 మార్చి వరకు సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. టీఎస్ఐపాస్ అమలులో కీలకపాత్ర పోషించారు. ‘ఇండస్ట్రీ చేజింగ్ సెల్’కు స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు అటవీశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2013 ఆగస్టు నుంచి 2015 మే వరకు దాదాపు రెండేండ్లపాటు ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. 1990 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అరుణాచల్ ప్రదేశ్‌లోని ఛాంగ్లాంగ్ జిల్లా కలెక్టర్‌గా విధులు సైతం నిర్వర్తించారు.