హనుమకొండ, ఏప్రిల్ 24: ప్రభుత్వ అలసత్వంతోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని ఎర్రబెల్లి నివాసంలో ఆరూరి రమేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి ముత్తోజిపేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను నమ్మించి కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని మండిపడ్డారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకిరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ శంకర్‌గౌడ్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే నివాళులర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఎర్రబెల్లిని రాత్రి వరకు గృహనిర్బంధంలోనే ఉంచారు.