పరిగి, సెప్టెంబర్ 19 : శంషాబాద్ నుంచి పరిగి రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దంటూ భూములు కోల్పోతున్న రైతులు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ రైతువేదిక వద్ద రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పచ్చటి పంటలు పండే పొలాల్లో రేడియల్ రోడ్డు వేస్తామంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేడియల్ రోడ్డు నిర్మాణంతో రంగాపూర్, పెద్ద మాదారం, చిన్న మాదారం, మంచన్‌పల్లి, మరియపురం, పుడుగుర్తి, కంకల్, మిట్టకంకల్ లో పేదల భూములు పోతాయని వాపోయారు. పేదల భూములే లక్ష్యంగా 333 ఫీట్ల వెడల్పుతో శంషాబాద్ నుంచి పరిగి రేడియల్ రోడ్డు వేస్తామంటూ ప్రభుత్వం పేర్కొనడం సరికాదని మండిపడ్డారు. కొత్వాల్‌గూడ నుంచి కొడంగల్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు.
శంషాబాద్ నుంచి నాగర్‌గూడ వరకు ఉన్న వంద ఫీట్ల రోడ్డును కొనసాగించి నేవీ రాడార్ వరకు ఇవ్వాలేకాని కానీ శంషాబాద్-పరిగి రోడ్డు వద్దని తేల్చిచెప్పారు. రేడియల్ రోడ్డుకు వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు. రైతులకు సంఘీభావంగా పూడూరు మాజీ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి కొడంగల్, పరిగి ప్రజలపై ప్రేమ ఉంటే పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఆరు లేన్ల రోడ్డు, షాద్‌నగర్ నుంచి పరిగి రోడ్డును పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. సీఎం త్వరగా కొడంగల్‌కు వెళ్లాలనుకుంటే ఉన్న రోడ్డునే మరో 2 లేన్లు పెంచాలని సూచించారు.త్రిబుల్ ఆర్కు రేడియల్ రోడ్డు నిర్మాణం దేనికని, రైతుల ప్రాణాలు తీయడానికా అని రైతు నాయకుడు ఆనంద్ ప్రశ్నించారు.
ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న రేడియల్ రోడ్డు నిర్మాణంతో మా ఎకరం భూమి పోతున్నది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.3 కోట్లు పలుకుతున్నది. మాకు తెలియకుండానే రేడియల్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ విడుదల చేశారు. ఉన్న కొంత భూమి రోడ్డుకు పోతుంటే మేము ఎట్ల బతకాలి. మా జీవితాలన్నీ ఆగమవుతాయి. రోడ్డు కోసం మా భూములు తీసుకోవద్దు.
-బాల్‌రాజ్, రైతు, రంగాపూర్