శంషాబాద్ రూరల్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం శనివారం జరిగిన భూసేకరణ ప్రక్రియ పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులు, గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు నినాదాలు చేస్తూ అధికారులను నిలదీశారు. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రైతులకు మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు గ్రామానికి చేరుకొనే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని సైతం అడ్డుకొన్నారు. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సరైన పరిహారం. పునరావాసంపై స్పష్టత ఇవ్వకుండా భూములు స్వాధీనం చేసుకోవడం సరికాదని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపి తమకు సరైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. భూసేకరణ అంశంతో బహదూర్‌గూడలో రోజంతా ఉత్కంఠ వాతావరణం కొనసాగగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారు.

భూసేకరణ కోసం అధికారులు రాగా, వారికి మద్దతుగా వచ్చిన పోలీసులు రైతులను దీక్షా శిబిరం నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీక్షలో కూర్చున్న రైతులను అరెస్టు చేశారు. మహిళా రైతులనూ అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో భగ్గుమన్న రైతులు కుర్చీలతో దాడులు చేయడంతోపాటు కారంపొడి చల్లుతూ పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ ఘటనలో చేవెళ్ల డీసీపీ యోగేశ్గౌతమ్తో పాటు శంషాబాద్ సీఐ నరేందర్‌రెడ్డి, పలువురు ఎస్సైలకు గాయాలయ్యాయి. పోలీసులపై రైతులు దాడులు చేయడం మంచిదికాదని, దీక్ష విరమించాలని, కలెక్టర్ వద్దకెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలని చేవెళ్ల డీసీపీ సూచించారు. రైతులు మాత్రం తమ దీక్ష విరమించేదిలేదని స్పష్టంచేశారు.

బహదూర్‌గూడ గ్రామంలోని సర్వేనంబర్ 28లో 150 ఎకరాలు, సర్వేనంబర్ 62లో 500 ఎకరాలను మొత్తంగా 650 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 15 రోజుల నుంచి సంబంధిత అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి భూములిచ్చేదిలేదని బహదూర్‌గూడ రైతులు దీక్షలకు దిగారు. రాత్రి, పగలు తేడా లేకుండా దీక్షలు కొనసాగిస్తున్నారు. తొలి నుంచి దీక్షలకు ఎలాంటి అటంకం కలిగించని పోలీసులు.. శనివారం తెల్లవారుజాము నుంచి గ్రామాన్ని నలుమాలలా 1,200 మంది చుట్టుముట్టారు. దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడం కోసం మోహరించారు. ఉదయం 7.30 గంటల సమయంలో హైడ్రా అధికారులు భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న విషయం తెలిసి.. దీక్షా శిబిరం నుంచి రైతులు వెళ్లి అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో పోలీసులు కొందమంది రైతులను అరెస్టు చేసి వారిని పోలీస్ వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తుండగా, రైతులు ఆ వాహనాన్ని అడ్డుకొన్నారు. గొడవ ముదురుతున్నదని గమనించిన డీసీపీ అరెస్టు చేసిన రైతులను వదిలేయాలని ఆదేశించారు. అదే సమయంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో కుమ్మరి నర్సింహ అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే పోలీసులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు.

బహదూర్‌గూడ గ్రామ రైతుల దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి నాయకులతో కలిసి గ్రామానికి చేరుకొన్నారు. వెంటనే పోలీసులు కార్తీక్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. బుల్లెట్ ట్రైన్ పేరుతో పేద రైతులపై ప్రభుత్వం దండయాత్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. భూముల సేకరణ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

బహదూర్‌గూడలో 650 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్ తెలిపారు. ఆ భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకొంటామని స్పష్టంచేశారు. బహదూర్‌గూడలో రైతుల దీక్షా శిబిరం వద్దకు పోలీసుల సాయంతో చేరుకొన్న ఆయన మాట్లాడారు. తమ పూర్వీకులకు పూర్వకాలంలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఆ భూముల్లో వ్యవసాయం చేసుకొని వారసత్వంగా తాము జీవనం సాగిస్తున్నామని ఈ సందర్భంగా రైతులు ఆయనకు వివరించారు. కానీ భూరికార్డుల ప్రకారం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆర్డీవో చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి స్థానిక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తమకు అన్యాయం చేస్తున్నారని బహదూర్‌గూడ రైతులు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్ డౌన్‌డౌన్ అంటూ రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత 20 ఏండ్లుగా తమకు న్యాయం చేస్తానని ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే.. ఆతర్వాత పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రకాశ్ గౌడ్ తమకు ఎలాంటి న్యాయం చేయకపోగా, తమకు ఆన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.