CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు తీరుతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది పాలనలో ఈ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. ఫలితంగా చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కరువై, చేతి మగ్గాలు, మరమగ్గాలు మూలనపడ్డాయి. వేలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది కార్మికులకు ఆశనిపాతమైంది. వారికి ప్రత్యామ్నయం చూపించడంలోనూ ఈ సర్కారు విఫలమైంది.
మహిళలకు రెండు చీరల చొప్పున ఉచితంగా ఇస్తామని, అందుకోసం 1.30 కోట్ల చీరలు తయారు చేయిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ సర్కారు ఆదిలోనే మాట తప్పింది. వేములవాడ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వస్త్ర పరిశ్రమ మనుగడపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆశనిపాతమైంది. స్వయం స్వహాయక గ్రూపు మహిళలకు ఉచితంగా రెండు చీరల పంపిణీ కోసం నిర్ణయం తీసుకున్నామని చెప్పారే తప్పా.. వాటిని ఎప్పుడిస్తారు? ఎలా ఇస్తారు? 1.30 కోట్ల చీరల తయారీ బాధ్యతలు (వర్క్ ఆర్డర్లు) ఎవరికి ఇస్తారు? సూరత్ నుంచి తెప్పిస్తారా? లేక రాష్ట్రంలోని పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పిస్తారా? అన్న అంశాల పట్ల సీఎం నోరుమెదపనే లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలోనే దాదాపు 15 మందికి పైగా వస్త్ర కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు లెక్కలే చెప్తున్నాయి. దీనికంతటికీ కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న వైఖరే కారణమని చేనేత సంఘాలు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నది. దానిలో భాగంగా చేయూత పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది. ఈ పథకాన్ని పునరుద్ధించాలని సీఎం రేవంత్‌రెడ్డిని వేడుకున్నా కార్మికులకు చేదు అనుభవమే మిగిలిందని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.