హైదరాబాద్ సిటీబ్యూరో/కొత్తూరు, జూలై 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంచలనం రేపిన షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ సోమవారం విగతజీవిగా కనిపించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తన అమ్మమ్మ గ్రామం పెంజర్ల శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఉన్మాది రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్(28) తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో శుక్రవారం అర్ధరాత్రి బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మను హతమార్చాడు. అక్కడితో ఆగకుండా పోక్సో కేసు వ్యవహారంలో తనను కొంతకాలంగా ప్రశ్నిస్తున్న భార్యను కూడా కడతేర్చాడు. ఇద్దరు పిల్లలను కూడా గొంతులు కోసి అంతమొందించాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి రాజ్‌కుమార్ అదృశ్యమయ్యాడు.
రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు 12 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులైనా ఆచూకీ లభించలేదు. కాగా, సోమవారం ఉదయం కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెంజర్ల గ్రామ శివారులో ఒక వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోయినట్టు గుర్తుతెలియని వ్యక్తులు డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని రాజ్‌కుమార్‌గా నిర్ధారించారు. అయితే నిందితుడి జేబులో సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. అందులో వరుస హత్యలకు ముందు తీసుకున్న 2 నిమిషాల 26 సెకండ్ల సెల్ఫీ వీడియో లభించింది. పైసలు అన్ని వాళ్ల కోసమే ఖర్చుపెట్టానని, అప్పుల పాలయ్యానని, అంతేకాకుండా తనను జైలుకు పంపించారని పేర్కొన్నాడు. తనకు జీవితం లేదని.. అందుకే వాళ్లతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపుతున్నట్టు వెల్లడించాడు. దీంతో పథకం ప్రకారమే నిందితుడు ఈ హత్యలు చేసినట్టు వెల్లడైందని సీపీ తెలిపారు. సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషణ చేసి, మరిన్ని విషయాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
ముగిసిన అంత్యక్రియలు
రాజ్‌కుమార్ మృతదేహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు సోమవారం సాయంత్రం తరలించారు. రాత్రి పోస్టుమార్టం పూర్తి కాగా, రాజ్‌కుమార్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో చేవెళ్ల వైకుంఠధామంలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు.