సంగారెడ్డి. సెప్టెంబర్ 9: దేశవ్యాప్తంగా ప్రజలను మత విద్వేషాలతో రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధిపొందేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కళాశాలలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మతాల పేరుతో రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు.
మణిపూర్, హర్యానాలో అల్లర్లు జరుగుతుంటే కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నదని, నిధులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేని బీజేపీ.. మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నదని అన్నారు.