హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ క్యాటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీని చేయాలని, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీబీఏ రెండో సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను విద్యార్థులకు తగిన ప్రిపరేషన్ సమయం కల్పించేలా సవరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం ఎస్ఎఫ్ఐ లీడర్లు విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బీ బాలకిష్టారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీ కేటగిరీ సీట్ల వివరాలు, సంఖ్య, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం తదితర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచడంలేదని పేరొన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 వరకు గడువు ఉన్నప్పటికీ, అనేక కాలేజీలు ఇప్పటికే బీ కేటగిరీ సీట్లను విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారు.