హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఓ దళిత బిడ్డ గ్యాంగ్‌రేప్.. ఆపై అనుమానాస్పద స్థితిలో మృతి. హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఆదివాసీ బిడ్డపై లైంగికదాడి జరిగింది. కోదాడలో రాజకీయ పలుబడి కేసులో అమాయక దళిత యువకుడు లాకప్‌డెత్. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో తమను ఎదురించి గెలిచాడన్న అక్కసుతో దళిత సర్పంచ్, వార్డు మెంబర్లపై భౌతికదాడులు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం.. పోలీసుశాఖ చేష్టలుడిగి చూస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆడబిడ్డ లైంగికదాడికి బలైతే ఆ మృగాలపై కేసు కట్టే దిక్కే లేకుంటే.. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో దళిత, గిరిజనుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అణగారిన వర్గాల వారికి సామాజిక భద్రత కరువైంది. ఎక్కడో ఓ చోట.. ఏదోవిధంగా దళితులు, గిరిజనులపై దాడుల వార్తలు వెలువడుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు దారుణంగా పెరిగాయి. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023తో పోల్చితే 2024లో మహిళల హత్యలు 13.15శాతం పెరిగాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 363కు పెరిగాయి. గత ఏడాది రేప్కేసులు 2,945 (28.94%) నమోదయ్యాయి. ఇక ఎస్సీలు, ఎస్టీలపై జరిగిన నేరాలకు సంబంధించి నమోదైన కేసులు ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు అద్దం పడుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాలకు సంబంధించి 1,877 కేసులు నమోదు కాగా.. నిరుడు కేవలం 11 నెలల్లోనే 2,257 (20.24శాతం) కేసులు నమోదయ్యాయి. ఈ బాధితుల్లో 18 ఏండ్ల లోపు వారు 1251 మంది ఉండగా.. 18 ఏండ్లు పైబడిన వారు 274 మంది ఉన్నారు. ఇక 2025 జూన్ నాటికే 1,184 కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని అంచనా వేయవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బాధితులకు పోలీసు స్టేషన్లలో న్యాయం జరుగకపోవడంతో వారు మానవ హక్కుల కమిషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో ఎస్టీ ఎస్టీలపై దాడులు పెరుగుతుండటంతో పోలీసుశాఖ సూచనల మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. సాధ్యమైనంత వరకూ స్టేషన్ పరిధిలో.. ఫిర్యాదు అందగానే కేసును పరిష్కరించాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి అనధికారిక ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. బాధితుల పక్షాన కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు.. స్టేషన్లలోనే ‘పంచాయితీ’ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఘటనలు వెలుగులోకి రాకుండానే మరుగున పడిపోతున్నాయి. బాధితులు పోలీసు సెటిల్మెంట్లకు తలొగ్గకుండా.. ధైర్యంగా నిలిచిన చోటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. అయినా అక్కడ కూడా కేసులు వాపస్ తీసుకోవాలంటూ అగ్రవర్ణాల బెదిరింపులు, పోలీసుల ఒత్తిడులు నిత్యకృత్యంగా మారాయి. అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తు చేయాల్సిన డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారులే బాధితులను స్టేషన్లకు పిలిచి కేసు వాపసు తీసుకోవడంపై కౌన్సెలింగ్‌లు ఇస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆడబిడ్డ గ్యాంగ్ రేప్‌నకు గురైంది. తీవ్రమైన రక్తసావంతో ఆ బిడ్డ సొమ్మసిల్లింది. ఆపై అనుమానాస్పదరీతిలో మరణించింది. అగ్రవర్ణాలకు చెందిన నిందితులను వదిలేసి.. ఒక్కడిపైనే కేసు కట్టారు. ఆ కేసుపై దర్యాప్తు చేయాలంటే పోలీసులు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి, డైరెక్షన్ తీసుకోవాల్సిన దుస్థితి. గత నవంబర్ 16న పోలీసు కస్టడీలో మరణించిన కోదాడ దళిత యువకుడు కర్ల రాజేశ్ తల్లి నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేసింది. తన బిడ్డను చిత్రవధ చేసి, చంపిన పోలీసులపై అట్రాసిటీ కేసుతోపాటు మర్డర్ కేసు పెట్టాలని కోరింది. అందులోనూ ఓ బీసీ వర్గానికి చెందిన సీఐని సస్పెండ్ చేశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎస్ఐని డీపీవోకు అటాచ్ చేశారు. ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. వారే చిత్రవధకు గురిచేశారని విచారణలో తేలితే.. మర్డర్, అట్రాసిటీ కేసులు ఎందుకు నమోదు చేయలేదు? దాని వెనుక ఎవరి ప్రమేయం ఉంది? వారందరిపై చర్యలేవి? అనేది దళిత మేధావుల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న.