హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): మార్క్‌ఫెడ్‌లో గన్నీ సంచుల గ్యాంగ్ రాజ్యమేలుతుందా? సరఫరా కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి సరఫరా నిలిపివేశారా? ప్రస్తుతం మక్కల కొనుగోలులో గన్నీ సంచుల కొరతకు కాంట్రాక్టర్ల అత్యాశే కారణమా? ప్రక్రియ పూర్తయి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు ధరపై పేచీ పెడుతున్నారా? టెండర్లో వచ్చిన ధర తమకు గిట్టుబాటు కాదని, ధర పెంచితేనే సంచులు సరఫరా చేస్తామంటూ మొండికేశారా? ఇదే వివాదంతో గన్నీల సరఫరా నిలిచిపోయి మక్కల కొనుగోలుకు తీవ్ర ఆటంకం ఏర్పడిందా? అంటే అదే నిజమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఫలితంగానే అరిగోస పడాల్సిన దుస్థితి ఏర్పడిందని, గన్నీ సంచుల కోసం పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రీపగలు తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని కేంద్రాల వద్ద రాత్రిళ్లు సైతం రైతులు జాగరణ
చేస్తున్న ఘటనలు గన్నీసంచుల తీవ్ర కొరతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఒక్కో సంచిపై 10 అధిక డిమాండ్!
ఈ యాసంగిలో సుమారు 14.90 లక్షల టన్నుల మక్కల కొనుగోలు అంచనాతో మార్క్‌ఫెడ్ గన్నీల కోసం టెండర్లు పిలిచింది. టన్నుకు 20 సంచుల చొప్పున ఎన్ని అవసరమైతే అన్ని సరఫరా చేసేలా ప్రక్రియను చేపట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన ఈ టెండర్లను ఐదు కంపెనీలు దక్కించుకున్నట్టు తెలిసింది. ఒక్కో గన్నీకి రూ.23.22 టెండరు ఖరారైనట్టు సమాచారం. తొలుత ఈ ధరకు అంగీకరించిన సరఫరాదారులు ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించారని తెలుస్తున్నది. వివిధ కారణాలతో ఇతర రాష్ర్టాల్లో గన్నీ సంచుల ధరలు అధికంగా ఉండటంతో ఆ ధర కోసం పట్టుబడుతున్నట్టుగా తెలిసింది. టెండర్లో తక్కువ ధర పలికిందని, ఆ ధరతో తాము గన్నీలను సరఫరా చేయలేమంటూ తేల్చి చెప్పినట్టుగా సమచారం. ఇప్పుడు ఒక్కో గన్నీ సంచికి రూ.33 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంటే టెండర్ ధరతో పోల్చితే ఒక్కో గన్నీ సం చికి రూ.10 అదనంగా డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఈ మేరకు 3 కోట్ల గన్నీలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండటంతో మార్క్‌ఫెడ్‌పై రూ.30 కోట్ల భారం పడనున్నది. ఈ నేపథ్యంలో సరఫరాదారులంతా కుమ్మక్కై రూ.30 కోట్లు అదనంగా కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రీ టెండరా? ధరల పెంపా?
టెండర్లు ఖరారై కొంత మేర గన్నీలు సరఫరా చేసిన తర్వాత ధరలపై పేచీ పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరఫరాదారులు కుమ్మక్కై మూకుమ్మడిగా గన్నీ సంచుల సరఫరాను నిలిపివేసినట్టు తెలిసింది. ఈ ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా గన్నీల కొరత తీవ్రంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పునరాలోచనలో పడిన అధికారులు ధర పెంచాలా? లేక టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలువాలా? అనే యోచిస్తున్నట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం ఒకవేళ టెండర్ దక్కించుకున్నవాళ్లు గన్నీలు సరఫరా చేయడంలో విఫలమైతే వాళ్లను బ్లాక్‌లిస్టులో పెట్టి ఆ టెండర్లను రద్దుచేసి మళ్లీ కొత్త టెండర్లను పిలువాలి. అలాకాకుండా ధర పెంచితే అవినీతి ము ద్రపడుతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో టెండర్లు రద్దుచేసి రీటెండర్లకు వెళ్లాలని చూస్తున్నట్టు తెలిసింది.
గన్నీల కోసం రైతుల గోసగోస
రాష్ట్రవ్యాప్తంగా గన్నీ సంచుల కొరతతో మ క్కల కొనుగోలులో తీవ్ర గందరగోళం ఏర్పడింది. గన్నీ సంచులు దొరికితే గానీ మక్కలు కాంటా పెట్టే పరిస్థితి లేదు. ఇలా ఓవైపు ప్రభుత్వం అంతంత మాత్రంగానే మక్కలు కొనుగోలు చేస్తుంటే.. ఈ బాధకు తోడు గన్నీల కొరత రైతులను బాధిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మక్కలు పోసి రోజుల తరబడి పీఏసీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రిళ్లు కూడా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూలో ఉంచి అక్కడే వేచి ఉంటున్నారు. ఇప్పటికైనా గన్నీల కొరత తీర్చాలని వేడుకొంటున్నారు.