సూర్యాపేట, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం సేకరించకపోవడం, ఏపీలో విద్యుత్తు కోతలు తెలంగాణ రైతులకు శాపంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యు త్తు సంక్షోభం కారణంగా వారంలో ఐదు రోజులు మాత్రమే.. రోజుకు 12 గంటలే పరిశ్రమలకు కరెంటు ఇస్తుండటంతో అక్కడ మిల్లులు నడిచే పరిస్థితి లేదు. దీంతో సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు ట్రేడర్లు ఆసక్తి చూపట్లేదు. వెరసి ధాన్యం ధరలు పడిపోతున్నాయి. ‘ధాన్యం పండించండి.. మేము కేంద్రాన్ని ఒప్పించి కొనుగోలు చేస్తాం’ అని చెప్పిన రాష్ట్రంలోని బీజేపీ నాయకులపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
కేంద్రం నిర్లక్ష్యం.. రైతులకు శాపం
తెలంగాణపై వివక్ష చూపుతూ, ధాన్యం సేకరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని రైతులకు తీరని నష్టాన్ని చేకూరుస్తున్నది. కేంద్రం ధాన్యం సేకరించకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ ట్రేడర్లకు విక్రయించుకోవాల్సి వస్తున్నది. వారం రోజులుగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం వస్తుండగా.. శుక్రవారం వరకు క్వింటాల్‌కు రూ.1,600 నుంచి రూ.1,850 పలికింది. శనివారం ఒక్కసారిగా ధరలు పడిపోయి రూ.1,200 నుంచి రూ.1,500 మధ్య పలికింది. దీంతో రైతులు ఆందోళనకు దిగగా, అధికారులు ట్రేడర్లతో చర్చించారు.
తేమశాతం అధికంగా ఉండటం, ఏపీలో విద్యుత్తు కోతల కారణంగా మిల్లులు మూసివేస్తున్న క్రమంలో ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ట్రేడర్లు పేర్కొంటున్నారు. మార్కెట్లో దాదాపు 50 శాతం మంది ట్రేడర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డిమాండ్ మేరకు ధాన్యం కొనుగోలు చేసి కమీషన్ పద్ధతిలో పంపిస్తారు. ప్రస్తుతం ఏపీలో విద్యుత్తు కోతల కారణంగా మిల్లుల్లో ధాన్యం రాశులు పెరిగాయని, అక్కడ కూడా ధాన్యం తీసుకొనే పరిస్థితి లేదని చెప్తున్నారు. సూర్యాపేట నుంచి కాకినాడ, మండపేట, పెద్దాపురం తదితర ప్రాంతాలకు మూడు రోజుల క్రితం వెళ్లిన ధాన్యం లారీలు కూడా అన్లోడ్ కావడం లేదని, దీంతో తాము కూడా ధాన్యం కొనలేని పరిస్థితి నెలకొన్నదని ట్రేడర్లు అంటున్నారు.
బీజేపీపై రైతుల కన్నెర్ర
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రల కారణంగా తమ వడ్లకు ధరలు తగ్గాయని రైతులు కన్నెర్రజేశారు. శనివారం సూర్యాపేట మార్కెట్ యార్డు ఎదుట ఆందోళనకు దిగారు. మార్కెట్ గేట్ ఎదుట కొంత ధాన్యం పోసి నిప్పంటించారు. కేంద్రం తీరును నిరసిస్తూ కాంటాలు అడ్డుకొన్నారు. వెంటనే అక్కడికి చేరుకొన్న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, రెవెన్యూ అధికారులు రైతులతో మాట్లాడారు. ట్రేడర్లతో చర్చించారు. నిబంధనల మేరకు ఉన్న ధాన్యానికి ధరలు ఇవ్వకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొచ్చి మంచి ధర పొందాలని సూచిం చారు. మొత్తమ్మీద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల కనికరం చూపకపోవడం, ఏపీలో విద్యు త్తు సంక్షోభంతో ధాన్యం ధరలు తగ్గి సూర్యాపేట ప్రాంత రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి.