హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా.. ఏండ్ల తరబడి భారీగా బకాయిలు పెడు తూ.. ఇచ్చే డబ్బుల్లో కూడా ఉల్టా తమనే డిస్కౌంట్ అడుగుతున్న ప్రభుత్వంపై, ఎక్సైజ్ శాఖపై మద్యం కంపెనీల యజమానులు మం డిపడుతున్నారు. మద్యం సరఫరా చేసినందుకు రావల్సిన డబ్బులు మొత్తం రూ.3,700 కోట్ల బకాయిలు ఇవ్వకుండా, కొత్తగా చేపట్టే బిల్లులకు డిసౌంట్లు ఎలా అడుగుతారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం సరఫరా కంపెనీలకు మధ్య తీవ్ర వివాదం నెలకొన్నది. కొన్ని నెలలుగా 3,700 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. తాజాగా కొత్త ఆర్డర్లపై డిసౌంట్లు అడుగడంతో మద్యం కంపెనీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా దేశీయ, అంతర్జాతీయ మద్యం తయారీ సంస్థల సంఘాలు రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాయి.
తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు, మద్యం సరఫరా చేసే కంపెనీలకు 2025 డిసెంబర్ మొదటి వారం నుంచి ఏప్రిల్ 2026 వరకు రావాల్సి న రూ.3,725.73 కోట్ల చెల్లింపులను ప్రభు త్వం నిలిపివేసింది. పాత బకాయిలు అలాగే ఉంచి, జూన్ 1 నుంచి ప్రభుత్వం కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. మేలో సరఫరా చేసిన కొత్త స్టాక్‌కు సంబంధించిన బిల్లులను 15 రోజుల్లోనే చెల్లిస్తామని, ప్రతిగా 2% నుంచి 2.75% వరకు ‘ఎర్లీ పేమెంట్’ నగదు డిసౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదని మద్యం సరఫరా చేసే కంపెనీలు చెప్తున్నాయి.
దేశంలో 80 శాతానికిపైగా మద్యం, బీర్, వైన్ మారెట్ను శాసిస్తున్న మూడు ప్రధాన జాతీయ సంఘాలైన బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆలహాలిక్ బెవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) సంయుక్తంగా ప్రభుత్వానికి లేఖ రాశాయి.
టెండర్ నిబంధనల్లో క్యాష్ డిసౌంట్ క్లాజ్ ఉన్నప్పటికీ.. అది సరఫరాదారుల (కంపెనీల) ఇష్టపూర్వక అభ్యర్థనపై మాత్రమే వర్తిస్తుంది. కానీ, ప్రభుత్వం తనకున్న అధికార బలంతో ఏకపక్షంగా, బలవంతంగా డిసౌం ట్లు మినహాయించుకోవడం వాణిజ్య సూత్రాలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. ప్రభు త్వం డిసౌంట్ల కోసం కొత్త బిల్లులనే క్లియర్ చేస్తూపోతే.. నెలల తరబడి పేరుకుపోయిన 3,700 కోట్ల పాత బకాయిలు ఎప్పటికీ వసూ లు కాకుండా పోయే ప్రమాదం ఉన్నదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం గందరగోళంలోకి నెట్టడంతో పాత బకాయిల వసూలు రాబట్టుకొనేందుకు ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టారు. డిసెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.3,725 కోట్ల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాత బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు కొత్త సరఫరాలపై ముందస్తు డిసౌంట్ మినహాయింపుల విధానాన్ని అమలు చేయకూడదని కోరాయి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే.. మద్యం పరిశ్రమ ఆర్థికంగా ఒత్తిడిని ఎదురొ నే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించాయి.