బాసర, జూలై 5 : తమ బాధలను అర్థం చేసుకొని తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీకి పలువురు గెస్ట్ ఫ్యాకల్టీలు లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఆరేండ్లుగా పని చేస్తున్నామని, ఏటా తమను రెన్యువల్ చేసుకునేవారని, కానీ ఈ ఏడాది యూనివర్సిటీ ప్రారంభమై నెల రోజులైనా విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేతనం అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు.
రాయపర్తిలో గురుకుల సిబ్బంది నిరసన
రాయపర్తి, జూలై 5: సాంఘిక సంక్షేమ గురుకులాల పనివేళలను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గురుకులాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, తాజా ఉత్తర్వుల మేరకు 8 గంటలకే ప్రారంభించాల్సి వస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ఒంటెద్దు పోకడలు, ఉద్యోగుల వ్యతిరేక నిర్ణయాలను ఇప్పటికైనా మానుకోవాలని, గురుకులాల పనివేళలను సవరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
కుల గణనకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : కుల గణనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేసి, నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కమిషన్ సభ్యుడు ఉపేంద్రను బీసీ దళ్ నేతలతో కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్, ప్రొఫెసర్ బాలయ్య, సంచార కులాల సంఘం జాతీయ అధ్యక్షుడు నరహరి, ఉమేశ్, వెంకటరమణ పాల్గొన్నారు.