Congress Govt | చుంచుపల్లి, జూలై 18: ఊహించినదే అయింది. కర్షకుల రుణమాఫీకి కొర్రీలమీద కొర్రీలు పెట్టిన కాంగ్రెస్ సర్కారు కొత్తగూడెం సహకార సంఘంలో కర్షకులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పట్టాదారు పాస్‌పుస్తకాలు, రేషన్‌కార్డులు అంటూ ఎడాపెడా నిబంధనలు పెడుతూ వచ్చిన రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ రైతుల్లో వీలైనంతమందిని తొలగించాలని నిర్ణయించుకున్నట్టుగా ఉంది.
పట్టాదారు పాస్ పుస్తకం లేదన్న కారణంగా అనేక మంది రైతులను రుణమాఫీ నుంచి పక్కకు తప్పించింది. కొత్తగూడెం సహకార సంఘం బాధ్యులు తమ సొసైటీ పరిధిలో మొత్తం 3,140 మంది రైతులకు రూ.12.71 కోట్ల పంట రుణాలను మంజూరు చేశారు. వీరిలో 720 మంది రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు లేకపోవడంతో కేవలం పహాణీల మీదనే పంట రుణాలు ఇచ్చారు.
అర్హులైన రైతుల వివరాలు పంపాలని ప్రభుత్వం కోరడంతో మొత్తం జాబితా పంపారు. కానీ, గురువారం ప్రభు త్వం ప్రకటించిన రుణమాఫీ అర్హుల జాబితాలో 720 మంది రైతుల పేర్లు లేవు. పట్టాబుక్కు లేదన్న కారణంతోనే రుణమాఫీ అర్హుల జాబితాలోంచి ప్రభుత్వం వీరిని తొలగించింది.