జనగామ రూరల్, సెప్టెంబర్ 16 : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ మండలం మరిగడి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పల్లా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలన్నీ అంధకారంలో మగ్గుతున్నాయని ఆరోపించారు. ఎక్కడా రూపాయి అభివృద్ధి జరగక గ్రామాలన్నీ కళతప్పినట్టు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు రానున్న రోజుల్లో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బూరగోని యాదగిరిగౌడ్, మాజీ సర్పంచ్ ఇట్టబోయిన రజిత శ్రీనివాస్, నాయకులు కూరాకుల రమేశ్, అబ్బ సాయిలు తదితరులు పాల్గొన్నారు.