గుమ్మడిదల, ఫిబ్రవరి 5 : స్థానికుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో మంగళవారం అర్థరాత్రి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అట్టుడికింది. రేవంత్ ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు కదం తొక్కారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధి ప్యారానగర్ గ్రామ శివారులోని అటవీప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానికులు కన్నెర్రజేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వందలాది ప్రజలు, ప్రజాప్రతినిధులను సినీఫక్కీలో పోలీసులు అరెస్టు చేసి సంగారెడ్డి జిల్లాలోని చిద్రుప్ప పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు డంపింగ్‌యార్డును అడ్డుకోవడం, అంతే పట్టుదలగా జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు డంపింగ్‌యార్డు వద్దకు మంగళవారం అర్ధరాత్రి వందలాది టిప్పర్లతో రోడ్డు వేస్తుండటంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.
ఆగ్రహించిన స్థానికులు, రైతు సంఘం నాయకులు గుమ్మడిదలలోని జాతీయరహదారిపై బైఠాయించారు. 144 సెక్షన్ విధించి మరీ ఆ ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని పోలీసుల బలగాలు, జీహెచ్ఎంసీ అధికారులు డంపింగ్‌యార్డు ఏర్పాటును పర్యవేక్షించారు. దీంతో తమను ఎక్కడా అరెస్టు చేస్తారో అనే భయంతో స్థానిక ప్రజలు అడవుల్లో, పంట పొలాల్లో తలదాచుకున్నారు. ఆ చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొత్తపల్లిలో ఓ యువకుడు అయితే డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తూ ఏకంగా సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తంచేశాడు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కొలను బాల్‌రెడ్డి, తొంట అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఆ గ్రామాల ప్రజలకు మద్దతు పలికారు. ఎట్టి పరిస్థితిల్లోనూ డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయనియ్యబోమని కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు.
ప్రజలకు మద్దతుగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే సునీత, బీఆర్ఎస్ నాయకులు, రైతులను సైతం అక్రమంగా అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డంపింగ్‌యార్డుతో తమ ఊళ్లను వల్లకాడు చేయొద్దని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్నారు. మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా వెంటనే పోలీసులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. కాగా మరో మూడు రోజులపాటు డంపింగ్‌యార్డు పనులు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. యూరోపియన్ టెక్నాలజీతో ఎలాంటి దుర్వాసన రాదని, పరిసరాలు కాలుష్యం కాకుండా డంపింగ్‌యార్డును నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ దుర్గాప్రసాద్ తెలిపారు. సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవ్‌రావు పర్యవేక్షణలో డంపింగ్‌యార్డు పనులు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో పోలీసుల బలగాలు టెంట్లు వేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నల్లవల్లి, ప్యారానగర్లో డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహా పార్టీ నేతలను అరెస్టు చేయటాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదని, ఎమర్జెన్సీ పాలన అని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడకుంటే ప్రజలు తగినబుద్ధి చెబుతారని హెచ్చరించారు. రేవంత్ సర్కారు ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితోపాటు బీఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు ప్రజాప్రతినిధి వెళ్లకూడదా? స్థానిక ఎమ్మెల్యేగా వారియోగ క్షేమాలను పట్టించుకోకూడదా? అని ప్రశ్నించారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు చేసి పోలీస్స్టేషన్లలో ఎందుకు నిర్బంధిస్తున్నారని నిలదీశారు. నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని ప్రశ్నించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే హకే లేదా? అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదలచేయాలని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, రాక్షసపాలన అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలన అంటూ ఊదరగొట్టి, ఎమర్జెన్సీని తలపించే నిర్బంధ చర్యలను ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేకు నిరసన తెలిపే హకు కూడా లేదా..? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అని మండిపడ్డారు. ప్రజలను భయపెట్టే నిరంకుశ వైఖరిని విడనాడకపోతే మరో లగచర్ల తరహా ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్లో అక్రమంగా అరెస్టుచేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మిరెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలను, అక్రమంగా నిర్బంధించిన అమాయకులైన ప్రజలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస సర్కార్ మంటగలుపుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాపోరాటాలకు వెన్నుదన్నుగా ఉన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. ప్రజాపాలన అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నదని ధ్వజమెత్తారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా.. ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టంచేశారు. సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.