హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ)/జహీరాబాద్ : తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, తాజా బడ్జెట్లో నయాపైసా కేటాయించకుండా రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్‌రావు ఆధ్వర్యంలో ఝరాసంగం, కోహీర్ మండలాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పాటిల్, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు బస్వరాజ్, మాజీ ఎంపీటీసీలు విజేందర్‌రెడ్డి, సంతోష్‌పాటిల్, సీనియర్ నాయకులు భూమయ్య, సుభాశ్‌రావు, లక్ష్మయ్యతోపాటు 20 మందికి పైగా ముఖ్య నాయకులకు హరీశ్‌రావు గులాబీ కండువాలను కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ఎలాంటి మేలు చేయడం లేదని ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ చిన్నచూపు చూస్తున్నదని, విభజన హామీలను అమలు చేయకుండా చట్టాలను ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సంగారెడ్డి జల్లా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఎన్డీఎఫ్, టీపీఐడీసీ నిధులను విడుదల చేయకుండా అన్యాయం చేస్తున్నదని చెప్పారు.
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ శంకుస్థాపన చేసిన బసవేశ్వర, సంగమేశ్వర పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి జిల్లాకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చేందుకు త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ సీనియర్ నేత నామ రవికిరణ్ పాల్గొన్నారు.