Mancherial | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో గత నెల 24వ తేదీన చిన్నారిపై హత్యాచారం చేసి బావిలో పడేసిన కేసును పోలీసులు చేధించారు. బాలికకు వరుసకు పెద్ద నాన్న అయ్యే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగొట్టినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు వివరాలను డీసీపీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు.
బావిలో బాలిక మృతదేహం లభ్యమవ్వడంతో కేసు కు సంబంధించిన వివరాల కోసం పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో చిన్నారికి పెద్ద నాన్న అయ్యే శనిగారపు బాపు (52), ఉప్పారపు సతీశ్ (40) కదలికలపై అనుమానం వచ్చి విచారించగా.. తామే నేరాన్ని చేసినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికకు కుర్కురే ప్యాకెట్ కొనిస్తామని ఆశ చూపి, సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశామని.. ఎవరికైనా చెబుతుందేమోనని ఆమె గొంతు నులిమి చంపేశామని చెప్పినట్లు చెప్పారు. అనంతరం బావిలో పడేసినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.