Vikarabad | వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కమ్లీబాయ్ నిర్వహించిన ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక దుర్మరణం చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. సర్పంచ్ల ప్రమాణస్వీకరం సోమవారం నాడు పూర్తి కావడంతో రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కమ్లీబాయ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పర్మిషన్ లేకున్నా డీజేతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆ ర్యాలీని చూస్తున్న సమయంలోనే ఏడేళ్ల చిన్నారి కుర్వా సౌజన్యపై నుంచి సర్పంచ్ కారు వెళ్లింది. కారు చక్రాల కింద నలిగి తీవ్ర గాయాలు కావడంతో బాలికను హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
విజయోత్సవ ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుండి వెళ్ళిన సర్పంచ్ కారు.. చిన్నారి మృతి
వికారాబాద్ జిల్లా పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కమ్లిబాయ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి
పర్మిషన్ లేకున్నా డీజే ర్యాలీ.. ర్యాలీలో చిన్నారి కుర్వా సౌజన్య(7)పై నుండి వెళ్ళిన సర్పంచ్ కారు… pic.twitter.com/HjlKpekETS
— Telugu Scribe (@TeluguScribe) December 23, 2025
బాలిక మృతితో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ర్యాలీలో సర్పంచ్ కారు కింద పడటంతోనే తన కూతురు మరణించిందని బాలిక తండ్రి, గ్రామస్తులు ఆరోపించారు. కానీ బాలిక కారు కింద పడలేదని సర్పంచ్ భర్త పెంటయ్య వాదించారు. దీంతో ఆస్పత్రి ముందు బాధిత కుటుంబసభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పంపించేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.