ఖైరతాబాద్, జూలై 30 : రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లంబాడీలు ఎస్టీలు కాదని, వారిని జాబితా నుంచి తొలగించాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు సుప్రీంకోర్టులో కేసువేశారని తెలిపారు. తెల్లం.. మంత్రి పొంగులేటి అనుచరుడైతే, సోయం కాంగ్రెస్ నాయకుడని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెరవెనుక ఉండి కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది లంబాడీల భిక్షేనని స్పష్టంచేశారు. గద్దెనెక్కించిన జాతిపై విషాన్ని ఎందుకు కక్కుతున్నారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రభుత్వంపై లంబాడీలు తిరుగుబాటుచేసిన క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణలో సైతం లంబాడీలకు చోటులేకుండా చేశారని తెలిపారు. రిజర్వేషన్లు తొలగించి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలను దూరం చేయాలన్న కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు ఒకటి నుంచి తొమ్మిది రోజుల పాటు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తీజ్ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కోటి రూపాయలు కేటాయించి తీజ్‌ను అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు.