ఉమ్మడి వరంగల్‌జిల్లాలోని 1165 ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పాఠశాలల్లో ఈ ఏడాదినుంచే మన ఊరు-మన బడి అమలుచేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం కంఠాయపాలెం మండల ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల బలోపేత పనులకు మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఎర్రబెల్లి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మొదటగా కంఠాయపాలెం స్కూల్‌ను ఎంపిక చేసుకున్నామన్నారు. పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, రాబోయే ఆరు నెలల్లో పనులు పూర్తిచేస్తామన్నారు. పాఠశాలను బాగుచేయడం, పేదలకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే సీఎం కేసీఆర్ ప్రస్తుత లక్ష్యమని వివరించారు. అందులో భాగంగానే వరంగల్‌లో దవాఖాన నిర్మాణం చేపట్టామన్నారు. జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాల ఏర్పాటుతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
బడుగు,బలహీనవర్గాలకు స్వర్ణయుగం..:మంత్రి సత్యవతిరాథోడ్
సీఎం కేసీఆర్ పాలనలో బడుగు, బలహీనవర్గాలకు స్వర్ణయుగం నడుస్తున్నదని మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లుంటారని, తల్లిదండ్రులు ఆలోచన చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు., అందరికీ అర్థమయ్యేవిధంగా పాఠ్యపుస్తకాలను ఒక వైపు ఇంగ్లిష్, మరొక వైపు తెలుగులో ముద్రణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అభిషేక్ అగస్త్య,తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రాంచంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుమర్తి శాంత, ఎంపీపీ తుర్పాటి చిన అంజయ్య, జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ పల్లె దేవమ్మ, సర్పంచ్ శ్రీపాల్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.