TGSET | జగిత్యాల, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాసులకక్కుర్తికి పాల్పడుతున్నదా? విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసేందుకు వెనుకాడటం లేదా? అంటే.. అవుననే అంటున్నారు బడుగు, బలహీన, నిరుపేద కుటుంబాల విద్యార్థులు. జాతీయస్థాయిలో నిర్వహించే నెట్ ప్రవేశ పరీక్ష కంటే, రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష సెట్‌కు (TGSET ) అధికంగా ఫీజు వసూలు చేస్తుండడంపై మండిపడుతున్నారు. ఫీజు గడువు ముగిశాఖ అపరాధ రుసుముతో భారీగా వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నెట్‌కు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తక్కువ ఫీజు నిర్దేశించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయావర్గాలను సైతం వదలకపోవడంపై ఫైర్ అవుతున్నారు. పరీక్ష రాసేందుకు సైతం జంకుతున్నారు.
జాతీయస్థాయిలో ఏటా రెండుసార్లు నిర్వహించే నెట్ పరీక్ష రాసేందుకు జనరల్ అభ్యర్థులకు రూ.1,150 ప్రవేశ రుసుం నిర్దేశించగా, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జండర్, పీహెచ్సీవారికి రూ.325 ప్రవేశరుసుం నిర్ణయించారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉస్మానియా యూనివర్సిటీ సెట్(స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్) ప్రవేశ పరీక్షకు గతనెల 30న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు.. పోస్టుగ్రాడ్యుయేషన్‌లో 55శాతం మార్కులు పొందినవారు అర్హులు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగం పొందేందుకు అర్హులుగా గుర్తించబడతారు. అయితే, పరీక్ష ఫీజుపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు రూ.2 వేల ఫీజు నిర్దేశించగా, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీ వారికి రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్, పీహెచ్సీ అభ్యర్థులు రూ.వెయ్యి చెల్లించాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 30వరకు గడువు ఇచ్చారు. నవంబర్ 1 నుంచి 8వరకు రూ.1,500, నవంబర్ 9 నుంచి 19 వరకు రూ.2వేల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక రూ.3వేల అపరాధ రుసుముతో నవంబర్ 21, 22 తేదీల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి భారీగా ఫీజు వసూలు చేస్తుండడంపై పరీక్ష రాసే అభ్యర్థులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు.