భీమారం/మంచిర్యాల టౌన్/జన్నారం/కాసిపేట, నవంబర్ 24 : ఎంపీడీవో నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్ఐ శ్వేత చేరుకొని ఎంపీడీవో మధుసూదన్, ఆందోళనకారులతో మాట్లాడి కలెక్టర్ దగ్గరకు వెళ్తే న్యాయం జరుగుతుందని సూచించారు. కలెక్టర్ సీసీతో ఎస్ఐ మాట్లాడించగా వారు కలెక్టరేట్‌కు వెళ్లారు. మంచిర్యాల పట్టణంలో బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో ప్రతులను ఆ సంఘం జేఏసీ నాయకులు దహనం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై బీసీ సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కాసిపేట మండలంలోని ఏ ఒక్క గ్రామ పంచాయతీని కూడా బీసీకి కేటాయించలేదంటూ కాసిపేట మండల బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మాజీ సర్పంచ్ దుస్స చందు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతిపత్రం అందించారు.
బీసీ రిజర్వేషన్లపై నిరసన
ఆదిలాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో బీసీలకు రిజర్వేషన్లు సరిగా అమలు చేయలేదంటూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీలు ఆందోళన చేశారు. ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నదని, 2019 ఎన్నికల్లో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఈసారి కేవలం 11 శాతం ఇచ్చారని మండిపడ్డారు. పాత విధానం ద్వారా 23 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.