మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్: ఓ నిరుపేద దళిత విద్యార్థికి న్యాయం దక్కని వైనమిది. అతనిపై జరిగిన దౌర్జన్యంతో ఆ కుటుంబమే చితికి పోయింది. ఆ విద్యార్థి శారీరకంగా మంచానికే పరిమతవగా, అప్పులపాలైన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది. మాది ప్రజాపాలన అని చెప్పుకునే సీఎం సొంత జిల్లాలోనే ఆ దళిత కుటుంబం 12 రోజులుగా చేతులు జోడించి న్యాయం కోసం వేడుకుంటున్నది. భూత్పూర్ మండలం అన్నాసాగర్‌కు చెందిన సాయిచరణ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో తృతీయ (మెకానికల్) సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల 16న మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కళాశాల నుంచి బస్టాప్‌కు వెళ్తుండగా, వన్‌టౌన్‌కు కూతవేటు దూరంలో 8 మంది బండ్లగేరికి చెందిన యువకులు గంజాయి సేవిస్తూ విద్యార్థులను అటకాయించారు. సాయిచరణ్‌తోపాటు రామ్‌చరణ్, అఖిల్, సాయిమూర్తిని అడ్డగించి సిగరెట్లు కావాలి.. తేవాలంటూ దౌర్జన్యం చేశారు. ఈలోగా మిగతా వారు తప్పించుకొని పారిపోగా, వారి చేతికి సాయిచరణ్ చిక్కాడు. దీంతో ఇష్టానుసారంగా అతడిని ఎక్కడపడితే అక్కడ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి ఎలాగోలా బయటపడి స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.
వారు వచ్చి దవాఖానకు తీసుకెళ్లగా, చరణ్‌కు కడుపులో బలమైన గాయలవడంతో వైద్య చికిత్సలు చేయించారు. దీనికోసం సుమారు రూ.3 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం చేయించారు. దవాఖాన నుంచి డిశ్చార్జి అయినా ఇప్పటికీ ఆ విద్యార్థి మంచానికే పరిమతమయ్యాడు. కోలుకోవడానికి నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. నెలకు రూ.10 వేల చొప్పున మందులను జీవితాంతం వాడాలని చెప్పారు. దీంతో ఆర్థికంగా చితికిపోగా, మానసికంగా చేతికి అందివచ్చిన కొడుకు నిస్సహాయ స్థితిలో మంచంలో ఉండటాన్ని జీర్ణించుకోలేక దుఃఖసాగరంలో మునిగిపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు వైద్యానికి ప్రభుత్వం సాయం చేయాలని, తన కొడుకుపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థి తండ్రి చిన్న నరసింహులు వేడుకుంటున్నారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని నిందితులను శిక్షించాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడుతామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన విద్యార్థి సాయిచరణ్‌ను పరామర్శించారు.
సాయిచరణ్‌ను దాడి ఘటనపై ఆరోజే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో 8 మంది నిందితులు ఉంటే.. శివ, హర్ష, మల్లిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి వారం రోజులుగా రాచమర్యాదలు చేసి పంపిస్తున్నారని, మిగతా ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు మమ్మల్ని ఏమీ చేయరు, వస్తుంటాం, పోతుంటా.. అంటూ స్టేషన్‌కు వెళ్లిన సాయిచరణ్ బంధువుల ముందే నిందితులు మాట్లాడడం అనుమానాలకు తావిస్తున్నది. విద్యార్థి చావుబతుకుల మధ్య ఉంటే పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. జిల్లా కేంద్రంలోని కొందరు పోలీసులు ఈ గంజాయి బ్యాచ్‌తో సన్నిహితంగా మెలుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.