హైదరాబాద్: తనవారికైతే ఒకలా.. ఇతరులకైతే మరోలా అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యవహరిస్తున్నారు. చెరువులను ఆక్రమించారన్న పేరుతో చెప్పాపెట్టకుండా కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు, సీఎం సోదరుడికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. దుర్గం చెరువును ఎఫ్టీఎల్ జోన్లో ఇంటిని నిర్మించిన సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి శేరిలింగంపల్లి అధికారులు నోటీసులు జారీచేశారు. 30 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ గడువిచ్చారు.
దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై అధికారులు దృష్టిసారించారు. చెరువును ఆనుకొని నిర్మించిన పలువురు ప్రముఖుల భవనాలు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో నెక్టార్ కాలనీ, డాక్టర్ కాలనీ, అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్‌లోని మొత్తం 204 నివాసాలకు శేరిలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీచేశారు. 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చేయాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు జారీచేసినవారి జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉన్నారు. ఆయన నివాసం ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్లు వెల్లడించారు.
‘చెరువులు, కుంటలను ఆక్రమించి నా కుటుంబసభ్యుల నిర్మాణాలు ఉన్నా నిలబడి కూల్చివేస్తా’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి దుర్గం చెరువును ఆక్రమించుకొని నిర్మించిన ఇంటి వివరాలను నెటిజన్లు వెలుగులోకి తెచ్చారు. ఆదారాలివిగో.. ఎప్పుడు కూలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
2000 సంవత్సరంలో భారీ వరదలు వస్తే.. ఈ చెరువు వరద నీరు ప్రవహించి ఏకంగా 9 కాలనీలు నీట మునిగాయి. దీంతో అప్పట్లోనే దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్‌ను నిర్ధారిస్తూ హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. కానీ చెరువు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇందులోనే సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ప్లాట్ నంబర్ 54, 55లో భారీ భవంతిని నిర్మించుకోవడమే ఇప్పుడు ప్రధాన చర్చకు కారణమైంది. మరి ఈ ఇంటినీ కూల్చివేస్తారా? అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంపన్నుల కబ్జా భవంతులను తొలి ప్రాధాన్యంగా కూల్చాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.
టీడీపీ, కాంగ్రెస్ పాలనలో చెరువుల అన్యాక్రాంతం
బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి కేబుల్ బ్రిడ్జిని దుర్గం చెరువుపై నిర్మించగా, కాంగ్రెస్, టీడీపీ పాలనలోనే చెరువులు అన్యాక్రాంతం అయ్యాయని నెటిజన్లు చెప్తున్నారు. అందుకు తిరుపతిరెడ్డి ఇల్లే నిదర్శనం అని పేర్కొంటున్నారు. దుర్గం చెరువు దాదాపు 85 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ప్రాంతాలను పూడ్చివేసి కాలనీలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను నిర్మించటం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అమర్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, కావూరి హిల్స్, కల్యాణ్‌నగర్, బృందావన్ కాలనీ, హెక్టార్ గార్డెన్ వంటి కాలనీలన్నీ 2000లో వరదలోనే మునిగాయని ఇరిగేషన్‌శాఖ గుర్తించింది.
ఈ క్రమంలో చెరువు భూముల్లో నిర్మించిన భవనాలను వ్యతిరేకిస్తూ కొందరూ కోర్టును ఆశ్రయించగా.. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతుల్లేని భవనాలను ఇరిగేషన్, రెవెన్యూ, హూడా అధికారులు తొలగించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో ఆక్రమణలపై చర్యలు నిలిచిపోయాయి. కానీ ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూశాఖ అధికారులు ఇచ్చిన ఆధారాలతో ఈ భూములు రెసిడెన్షియల్ కార్యాకలాపాలకు అనుకూలం కాదని, రిక్రియేషనల్ జోన్‌గా మార్చాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది.
సామాన్యుడిపైనే హైడ్రా ప్రతాపం
చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల విషయంలో దూకుడుగా వ్యవహారిస్తున్న హైడ్రా.. సామాన్యుడు నిర్మించుకున్న ఇండ్లపైనే ప్రతాపం చూపుతున్నదన్న విమర్శలు ఎదుర్కొంటున్నది. సామాన్యుడు నిర్మించుకునే, బిల్డర్లు, డెవలపర్లు చేసే తప్పిదాలతో కలల సౌధాలు కండ్ల ముందే పేకమేడల్లా కూలిపోతుంటే గుండెలు బాదుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజకీయ పలుకుబడితో చెరువులు, జలవనరులను చెరబట్టిన సంపన్న వర్గాల నిర్మాణాలను కూడా కూల్చివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.