హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్‌రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఆయనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని, ఇంటి నుంచి తీసుకొచ్చే భోజనాన్ని అందించాలని హైకోర్టు జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. జైలులో నరేందర్‌రెడ్డిని ఇతర నేరగాళ్లతో కలిపి ఉంచడాన్ని సవాలు చేస్తూ ఆయన భార్య శృతి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. ఫార్మా సిటీ భూసేకరణపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అందుకు తన భర్తే కారణమంటూ అన్యాయంగా కేసు బనాయించారని శృతి తన పిటిషన్లో పేరొన్నారు. నరేందర్‌రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచేలా జైలు అధికారులను ఆదేశించాలని, ఇంటి నుంచి ఆహారాన్ని పంపేందుకు అనుమతించాలని కోరారు.
ఆమె తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, న్యాయవాది సాముల రవీందర్ వాదనలు వినిపిస్తూ.. కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా నరేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నారని, అందుకే అక్రమంగా కేసులో ఇరికించారని వివరించారు. లగచర్లలో గిరిజనుల భూములు లాకొని ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నరేందర్‌రెడ్డి గుండె, మూత్రపిండాలు, వెన్ను, పొత్తికడుపు సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. విచారణ ఖైదీగా ఉన్న ఆయనను జైలులో నేరగాళ్లతో కలిపి ఉంచితే ప్రాణహాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను ప్రత్యేక బ్యారక్‌కు తరలించాలని, ఇంటి భోజనం స్వీకరించేందుకు అనుమతించాలని కోరారు. ఇదే విషయమై 15న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు జైళ్లశాఖ ఇన్స్పెక్టర్ జనరల్, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాదనలను న్యాయమూర్తి ఆమోదించారు.